గాజువాక మీద బీజేపీ కన్ను

విశాఖలో కీలకమైన నియోజకవర్గంగా గాజువాక ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక గ్లామర్ ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో గాజువాక మీద…

విశాఖలో కీలకమైన నియోజకవర్గంగా గాజువాక ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక గ్లామర్ ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో గాజువాక మీద అందరి చూపూ ఉంది. విశాఖ సిటీకి హాట్ ఫేవరేట్ సీటుగా గాజువాక నిలుస్తోంది. గాజువాక నుంచి మళ్ళీ జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులలో భాగంగా ఈ సీటుని అడిగి తీసుకోవాలని చూస్తున్నారు.

తెలుగుదేశానికి గాజువాకలో మొదటి నుంచి పట్టు ఉంది. ఆ సీటుని ఆ పార్టీ సైతం వదులుకోవడానికి సిద్ధంగా లేదు అని తమ్ముళ్ళు అంటున్నారు. ఇపుడు చూస్తే గాజువాక మీద బీజేపీ కన్ను కూడా పడిందని అంటున్నారు.

విశాఖ నుంచి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేయాలని చూస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా గాజువాకలో పర్యటించారు. గాజువాకలో బీజేపీ పటిష్టంగా ఉందని ఎంపీ అంటున్నారు. పార్టీ నిర్మాణం బాగుందని కాషాయం పార్టీ బలోపేతం అయిందని అంటున్నారు.

గాజువాకను విశాఖలో ఉన్న మిగిలిన జిల్లాలు స్పూర్తిగా తీసుకుని పార్టీని పటిష్టం చేయాలని ఆయన సూచించారు. విశాఖలో గాజువాకలో బీజేపీ బలం పెరిగిందని, బాగుందని ఎంపీ అంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న గాజువాకలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.

ఉత్తరాది వారు అంతా బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటారు. వారికి జాతీయ పార్టీగా బీజేపీ మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది. అలా కనుక విశ్లేషించుకుంటే గాజువాకలో బీజేపీ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గాజువాకలో బీజేపీ పటిష్టం కావడంతో పోటీ చేసేందుకు సైతం నేతలు ఉత్సాహ పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులు కనుక ఉంటే బీజేపీ కూడా గాజువాకను వదులుకోదని అంటున్నారు.