టీడీపీ, జనసేనలతో బీజేపీ ఫుట్‌బాల్ ఆడుతోంది. మూడు రోజుల క్రితం ఒక్కడివే ఢిల్లీకి రావాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు వర్తమానం పంపారు. 22న బీజేపీ పెద్దలతో పొత్తులపై సమావేశం వుందని, వెళ్లి వస్తానని రాజమండ్రిలో జనసేన నేతల సమావేశంలో పవన్ చెప్పారు. ఢిల్లీకి వెళ్లాలనే ఉద్దేశంతో భీమవరంలో సమావేశాన్ని ముగించుకుని పవన్ మంగళగిరి చేరుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి చావు కబురు చల్లగా వచ్చింది.
అదేంటంటే… బీజేపీ పెద్దల అపాయింట్మెంట్పై మళ్లీ సమాచారం ఇస్తామని. దీంతో తలూపుకుంటూ పవన్‌కల్యాణ్ ఢిల్లీ ప్రయాణాన్ని మానుకుని హైదరాబాద్ వెళ్లారు. ఢిల్లీ పర్యటన ఉందనే కారణంతో ఎలాంటి కార్యక్రమాలను పెట్టుకోలేదని జనసేన నాయకులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌కు సమయం ముంచుకొస్తున్న తరుణంలో ప్రతి నిమిషం ఎంతో కీలకం. ఇలాంటి సమయంలో పొత్తుపై ఎటూ తేల్చకుండా, కాలయాపన చేయడంపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లలో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది.
అలాగని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి. సీట్లు, నియోజక వర్గాల విషయమై తేల్చుకోవాల్సి వుంది. పవన్‌కల్యాణ్ మాత్రం ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ ఢిల్లీ వెళ్లి పొత్తుపై బీజేపీ పెద్దలతో చర్చిస్తారని అంతా అనుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తుపై స్పష్టత వస్తుందని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆశించారు.
తీరా ఢిల్లీ వెళ్లాల్సిన సమయంలో, బీజేపీ పెద్దలు రెడ్ సిగ్నల్ వేశారు. ఎందుకిలా జరుగుతున్నదో అర్థం కాని అయోమయ పరిస్థితి. మరోవైపు ఆలస్యం అయ్యే కొద్ది రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందనే భయం వెంటాడుతోంది.