క‌న్నాకు ఆ నాయ‌కుడితో బీజేపీ చెక్‌!

టీడీపీ సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు చెక్ పెట్టేలా ఏపీ బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ‌ను కాద‌ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీలో చేరిన క‌న్నాకు గ‌ట్టి షాక్ ఇచ్చేందుకు ఆయ‌న సామాజిక…

టీడీపీ సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు చెక్ పెట్టేలా ఏపీ బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ‌ను కాద‌ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీలో చేరిన క‌న్నాకు గ‌ట్టి షాక్ ఇచ్చేందుకు ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రామ‌చంద్ర‌ప్ర‌భు, ఆయ‌న పెద్ద కుమారుడు తుల‌సీ యోగీష్‌చంద్ర‌ల‌ను బీజేపీ అక్కున చేర్చుకుంది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో కేంద్ర మంత్రి ముర‌ళీధ‌ర‌న్‌, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుల స‌మ‌క్షంలో తండ్రీత‌న‌యుడు కాషాయం కండువా కప్పుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపు, బ‌లిజ‌, వాటి అనుబంధ కులాలు బ‌ల‌మైన ఓటు బ్యాంక్ క‌లిగి ఉన్నాయి. ఈ కార‌ణంగానే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించింది. కాంగ్రెస్ నుంచి ఆయ‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, సామాజిక కార‌ణాల రీత్యా క‌న్నాకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అయితే అధ్య‌క్ష ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో ఆయ‌న స్థానంలో సోము వీర్రాజును అధిష్టానం నియ‌మించింది.

వీర్రాజు నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డానికి క‌న్నా అంగీక‌రించ‌లేదు. బీజేపీ నియ‌మావ‌ళిని అతిక్ర‌మించి సోము వీర్రాజుకు వ్య‌తిరేకంగా ప‌లు మార్లు మాట్లాడారు. చివ‌రికి టీడీపీ పంచ‌న చేరారు. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, పారిశ్రామిక‌వేత్త అయిన గుంటూరుకు చెందిన తుల‌సీ రామ‌చంద్ర‌ప్ర‌భుపై బీజేపీ క‌న్నుప‌డింది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జిల్లాకే చెందిన ప్ర‌భు, ఆయ‌న కుమారుడిని చేర్చుకోవ‌డం ద్వారా కాపుల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌చ్చ‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

2009లో గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రామ‌చంద్ర‌ప్ర‌భు ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అది కూడా నాడు కాంగ్రెస్ అభ్య‌ర్థి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేతిలో ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం ఆయ‌న టీడీపీలో చేరారు. 2014లో పోటీ చేయాల‌ని భావించినా టీడీపీ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న రాజ‌కీయంగా మౌనాన్ని ఆశ్ర‌యించారు. ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ, ప్ర‌జ‌ల్లో త‌న పేరు విన‌ప‌డేలా చూసుకున్నారు.  

తాజాగా రామ‌చంద్ర‌ప్ర‌భు, ఆయ‌న త‌న‌యుడు బీజేపీలో చేర‌డంతో క‌న్నాపై పోటీకి మంచి అభ్య‌ర్థిని ఎంపిక చేశామ‌ని బీజేపీ సంబ‌ర‌ప‌డుతోంది.