ప్రియుడు మోసగించి, మరొకరితో లేచిపోతే ప్రియురాలి విరహ వేదన ఎలా వుంటుందో…ప్రస్తుతం ఏపీ బీజేపీ పరిస్థితి కూడా అలా వుందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. టీడీపీతో జనసేన కలిసి ఎన్నికలకు వెళుతుందని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నా… బీజేపీ మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు, తమ వెంటే వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఇటీవల చంద్రబాబునాయుడితో పవన్‌కల్యాణ్ భేటీ, నిన్నటి శ్రీకాకుళం సభలో పొత్తులపై పవన్ క్లారిటీ ఇవ్వడంతో బీజేపీకి వాస్తవం తెలిసొచ్చింది.
ఇక తమతో పవన్‌కల్యాణ్ ఎన్నికలకు రారనే చేదు నిజాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. తనకు తానుగానే తమతో పొత్తు కుదుర్చుకుని, తీరా ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో నమ్మించి మోసగించాడనే ఆగ్రహం బీజేపీ నేతల్లో వుంది. అయితే బీజేపీలోని చంద్రబాబు వీరాభిమానులు మాత్రం… తాజా రాజకీయ పరిణామాలపై ఆనందిస్తున్నారు. టీడీపీతో జనసేన కలిస్తే ఆ కూటమికి విజయావకాశాలు మెరుగుపడతాయనే నమ్మకం వారిలో మరింత పెరిగింది.
టీడీపీతో పొత్తు ఉండదని, కేవలం జనసేనతో మాత్రమే వుంటుందని ఇంతకాలం బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ తాజా వైఖరిపై ఏపీ బీజేపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు. రాజకీయ పరిణామాలన్నింటిని ఏపీ బీజేపీ ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తున్నట్టు సమాచారం. జనసేనాని ఎటూ తమతో రారనే స్పష్టత రావడంతో బీజేపీ కూడా వ్యూహాల్ని మార్చుకుంటోంది.
అందుకే నిన్న పవన్ సభకు పోటీగా తిరుమలలో గదుల అద్దె పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలకు ఏపీ బీజేపీ పిలుపునివ్వడం. టీడీపీతో పవన్ అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న తర్వాతే… జనసేనపై విమర్శలకు దిగాలని బీజేపీ యోచిస్తోంది. మొత్తానికి పవన్ తమను నమ్మించి వంచించారనే ఆవేదన మాత్రం ఏపీ బీజేపీని వెంటాడుతోంది.