పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అనుభవం ఎక్కువ అని చెప్పుకుంటారు. కానీ ఆచరణలో ఎపుడూ పప్పులో కాలేస్తూంటారు. ఎక్కడ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియాలి. లేకపోతే రాజకీయ నాయకుడిగా మనుగడ సాగించలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో మొదటి నుంచి అదే ఇబ్బంది. ఆయన ఇన్నేళ్లలో రాజకీయంగా ఉంటున్నా తాను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారో అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఒకరి మీద ద్వేషం ఉంటే ఉండొచ్చు. అది తనలో కసి పెరిగేలా చేయాలి. తాను బాగుపడాలి, తాను అందలాలు ఎక్కాలి అన్న పట్టుదలను క్రియేట్ చేయాలి.
జగన్ విషయమే తీసుకుంటే ఆయన చంద్రబాబు మీద కసితోనే రాజకీయ ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ కసికి తన కృషిని కలిపి అందలం అందుకున్నారు సీఎం జగన్ అనిపించుకున్నారు. మరి పవన్ మాత్రం జగన్ గద్దె మీద ఉండకూడదు అంటున్నారు. ఆయన మాజీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కానీ తాను సీఎం అని ఎక్కడా అనలేకపోతున్నారు.
దాని మీద శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదరి అప్పలారాజు అయితే గెలిచేందుకు వ్యూహాలు ఉండాలి కానీ ఒకరిని ఓడిస్తామని చెప్పేందుకు వ్యూహాలేంటి కళ్యాణ్ బాబూ అని ఒక సెటైర్ వేశారు. మీ జెండా అజెండా క్లారిటీ గా నిర్ణయించుకుని ముందుకు రావాల్సింది పోయి ఇంకా మమ్మల్ని తిట్టడమేనా అని ఎకసెక్కమాడారు.
రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి. కొందరైతే దాన్ని కాస్తా శృతి మించి ఎక్కువగా దూషణలు చేస్తారు. అయినా తాము పెట్టే మీటింగులలో అగ్ర భాగం తమ గురించి చెప్పుకోవాలని ఆరాటపడుతూంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సభలు చూస్తే ఆయన కూడా జగన్ని విమర్శిస్తారు. కానీ మీటింగ్ లో అధిక భాగం తాను సీఎం గా ఉన్నపుడు అది చేశాను ఇది చేశాను అని చెప్పుకుంటారు. తన పార్టీ గురించి కూడా చెప్పుకుంటారు.
ఇక జగన్ స్పీచ్ లో చూస్తే లాస్ట్ అయిదారు నిముషాలు మాత్రమే ప్రత్యర్ధులకు కేటాయిస్తారు. మొత్తం సభ అంతా తన ప్రభుత్వం పార్టీ కార్యక్రమాల గురించే చెప్పుకుంటూ వస్తారు. చిత్రమేంటి అంటే పవన్ కళ్యాణ్ సభలే ఎపుడూ జగన్ కి సమర్పితం అవుతూ ఉంటాయి. సభలో పవన్ మాట్లాడడం మొదలుపెడితే చాలు జగన్ని పట్టుకుని నిందించడమే పనిగా పెట్టుకుంటారు అని జనాలకూ తెలిసిపోతోంది. ఇక మంత్రులను వదలరు, తనను ఆ టైం లో ఎవరెవరు విమర్శించారో ఎక్కడా మరచిపోకుండా తుచ తప్పకుండా వాటికి బదులు అప్పచెప్పడమే పవన్ సభలలో కనిపించే ప్రత్యేకత.
పవన్ సభలకు వచ్చే వారికి ఆయన మీద అభిమానం ఉంటుంది. తన నాయకుడు ఏమి చెబుతారో అని ఎదురుచూస్తారు. అక్కడా జగన్నామస్మరణమే వినిపిస్తే ఇక వారు ఏమి చేస్తారు. తటస్థులు టీవీల ముందు కూర్చున్న వారు పవన్ పార్టీ ఏమి చెబుతుందో అని ఆతృత కనబరచేవారికి ఎపుడూ నిరాశకలిగించేలా పవన్ తిట్ల పురాణం ఉంటుంది అంటారు. మరి పవన్ తన తీరు మార్చుకోకపోతే ఆయన సభలు ఎపుడూ జగన్ పేరుతోనే మారు మోగుతాయి. అది ఇండైరెక్ట్ గా జగన్ కే మేలు చేస్తుందన్న లాజిక్ కి జనసేనాని మిస్ అయితే అది నిజమైన రాజకీయ వీర మరణం అవుతుంది.