బీజేపీ ఎంపీ జోక్ పేల్చారా..?

ఏపీలో బీజేపీకి ఇరవై ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటిస్తున్నారు. ఏపీలో బీజేపీకి బలం పెరిగింది అని ఆయన అంటున్నారు. తెలంగాణాలో అయితే బీఆర్ఎస్‌కి పోటీ ఇచ్చే పార్టీ…

ఏపీలో బీజేపీకి ఇరవై ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటిస్తున్నారు. ఏపీలో బీజేపీకి బలం పెరిగింది అని ఆయన అంటున్నారు. తెలంగాణాలో అయితే బీఆర్ఎస్‌కి పోటీ ఇచ్చే పార్టీ తామే అని చెబుతున్నారు  రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి ఆదరణ అంతకంతకు పెరుగుతోందని అంటున్నారు.

కేంద్ర బీజేపీ పెద్దల స్పెషల్ ఫోకస్ తెలుగు రాష్ట్రాల మీద ఉందని జీవీఎల్ అందువల్ల బీజేపీ దశ దిశ మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాదు దక్షిణాది రాష్ట్రాల ప్రజానీకం పూర్తిగా ఆదరిస్తారని, ఈసారి సౌతిండియాలోనే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయని జోస్యం చెబుతున్నారు.

మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే ఏపీలో బీజేపీకి ఇరవై సీట్లు రావడం అంటే అది పెద్ద జోక్ గా అని సెటైర్లు పేలుతున్నాయి. ఏపీలో బీజేపీకి అమాంతం అంత బలం ఎక్కడ నుంచి వస్తోంది అన్న ప్రశ్నలు పుట్టుకుని వస్తున్నాయి. ఈ నెలలో అమిత్ షా విశాఖ వచ్చినపుడు ఏపీ నుంచి ఇరవై ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. ఇపుడు జీవీఎల్ అన్ని సీట్లూ గెలిచేస్తున్నామని అంటున్నారు. ఎంపీ సీట్లు ఇరవై గెలిస్తే ఏపీలో అధికారం బీజేపీదే అవుతుంది కదా. మొత్తం 140 ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీ పరం అవుతాయని కదా ఏపీలో అధికారంలోకి వచ్చేది మేమే అని కూడా బీజేపీ నేతలు చెబుతారేమో అంటున్నారు.

ఏపీలో చూస్తే బీజేపీకి జనసేనతో పొత్తు ఉందని ఆయన అంటున్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాత్రం మాట్లాడడం లేదు. నిన్నటికి నిన్న సోము వీర్రాజు తెలుగుదేశంతో పొత్తు అన్నది ఊహాగానాలు అంటే జీవీఎల్ ఏపీలో తమ పార్టీకి పొత్తు ఉన్నది కేవలం జనసేనతో మాత్రమే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఆ మధ్యన అమిత్ షాని చంద్రబాబు కలసి వచ్చిన తరువాత టీడీపీతో బీజేపీ జత కడుతుందని అంతా భావించారు. 2014 పొత్తులు కుదురుతాయని కూడా అనుకున్నారు. జీవీఎల్, సోము వీర్రాజులు సైతం పొత్తు అన్నది కేంద్ర పెద్దల ఇష్టమన్నట్లుగా మాట్లాడారు. ఇపుడు చూస్తే పాత పాటే పాడుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.