రాష్ట్రంలో సోము వీర్రాజు వ్యవహరిస్తున్న తీరు పార్టీని పతనం దిశగా తీసుకువెళుతున్నదనే అభిప్రాయం కేవలం పార్టీ వారిలో మాత్రమే కాదు, సాధారణ పౌరుల్లో కూడా కలుగుతూనే ఉంది. కన్నా లక్ష్మీనారాయణ వంటి నాయకులు కేవలం సోము వీర్రాజు వైఖరి మీదనే ఆరోపణలు చేసి పార్టీని వీడి వెళ్లిపోయారు. విష్ణుకుమార్ రాజు వంటి నాయకులు కూడా పార్టీని వీడే బాటలో ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి.
సాధారణంగా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు.. పార్టీ హైకమాండ్ తనంతగా చొరవ తీసుకుని, ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రయత్నించాలి. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ కమల హైకమాండ్ తీరు చాలా చిత్రంగా ఉంది. వారు స్వయంగా తెలుసుకోవడం కాదు కదా.. తెలియజెప్పడానికి పార్టీ సీనియర్ నాయకులు వెళ్లినా కూడా వారి మొరను ఆలకించడం లేదు.
బిజెపిలోని కొంత మంది సీనియర్లు ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి సోము వీర్రాజు తీరుతెన్నుల మీద, పార్టీకి జరుగుతున్న నష్టం మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి వివరాలు చెబితే ఉపయోగం ఉంటుందనుకున్నారు. అయితే వారికి నడ్డా అపాయింట్మెంట్ దొరకనేలేదు. చివరికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి , మంత్రి మురళీధరన్ ను కలిశారు. ఆయన కూడా వీరి బాధ వినడానికి పెద్దగా మొగ్గు చూపించలేదు. పార్టీని నిలబెట్టడం కోసం అభిప్రాయాలు చెప్పడానికి వస్తే.. కనీసం మా మొర వినడానికి అరగంట సమయం కూడా ఆయన వద్ద లేదా.. అంటూ వారు వాపోతున్నారు.
సోము వీర్రాజుకు అనుకూలంగా జీవీఎల్ నరసింహారావు, సునీల్ దియోధర్ పనిచేస్తున్నారనేది అసమ్మతి నేతల ఆరోపణ. కంప్లయింటు చెప్పడానికి వెళ్లిన నేతల మొర ఆలకించని మంత్రి మురళీధరన్ అసలు వారు ఢిల్లీ రావడమే తప్పు అని వ్యాఖ్యానించినట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి రాష్ట్రంలో ఒక్కశాతం కంటె తక్కువ ఓట్లు వచ్చాయని, సోము వీర్రాజు నాయకత్వమే గనుక కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి అర శాతానికి పడిపోతాయని ఈ నాయకులు జోస్యం చెప్పడం గమనార్హం.
అధిష్ఠానం అడ్డగోలుగా సోము వీర్రాజును ఎందుకు వెనకేసుకొస్తున్నదో వారికి అర్థం కావడం లేదు. ఆయన వైఫల్యాల గురించి చెప్పబోతే.. కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు అంటూ ముద్ర వేయడానికి పార్టీ పెద్దలు ప్రయత్నించడం వారికి చిరాకు తెప్పిస్తోంది. కన్నా కంటె ముందునుంచి తాము పార్టీలో ఉన్నాం అని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.
కేవలం సోము వీర్రాజు తీరు మాత్రమే కాదు కదా.. ఆయనను వెనకేసుకురావడంలో పార్టీ హైకమాండ్ తీరు కూడా కలిపి.. రాష్ట్రంలో పార్టీని మరింత పతనానికి తీసుకువెళ్లేలా ఉన్నదని వారంతా ఆవేదన చెందుతున్నారు. చూడబోతే.. ఏపీ అభివృద్ధి చెందడంపై కొంచెమైనా శ్రద్ధ లేనట్లుగానే, ఏపీలో తమ పార్టీ అభివృద్ధి చెందడం మీద కూడా బిజెపికి శ్రద్ధ లేనట్లుగా ఉంది.