ఎన్డీయే నేతృత్వంలోని (ప్రధానంగా బీజేపీ) కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తుందో ఎవరికీ తెలియడంలేదు. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీని లక్ష్యంగా ఎంచుకుంటుందో, ఎప్పుడు ఏ నాయకుడిని రాజకీయంగా తొక్కిపారేస్తుందో, ఇమేజ్ను దెబ్బ కొడుతుందో అంతుపట్టదు.
మోడీ ప్రభుత్వం మీద హుంకరించే, ఘీంకరించే పార్టీలు సైతం ఐటీ, ఈడీ దాడులంటే వణికిపోతున్నాయి. ప్రతిపక్షాలు ఇలాంటి చర్యలను కక్ష సాధింపు చర్యలు అంటున్నాయి. కొంత కాలంగా తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ మీద, బీజేపీ మీదా చెలరేగిపోతున్నారు. మోడీ హైదరాబాదుకు వచ్చినప్పుడు ఏమాత్రం గౌరవించడం లేదు. ఆయన బాటలోనే కొడుకు కేటీఆర్, కుమార్తె కవిత కూడా నడుస్తున్నారు. మోడీ ఇవన్నీ గుర్తు పెట్టుకున్నారో ఏమో గానీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను ఇరికించారు.
ఆరోపణలు నిజమా కాదా అనే సంగతి తరువాత. ముందైతే కేసులు బుక్ చేస్తారు కదా. ఆ కేసులు ఒక కొలిక్కి వచ్చేసరికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం. ఈలోగా రాజకీయంగా జరగాల్సిన డామేజీ జరిగిపోతుంది. సరిగ్గా మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే కవితను లిక్కర్ స్కామ్ లో ఇరికించగా, తాజాగా హైదరాబాదులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ లో జరిగిన ఐటీ దాడుల్లో కేటీఆర్ పేరు బయటకు వచ్చింది. నగరంలోని ఫీనిక్స్ గ్రూపు సంస్థ కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉందన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ రోడ్ నం-45లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టారు. దాంతో పాటు నగరంలోని గ్రూపు కార్యాలయాలు, డైరెక్టర్ ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.
30కిపైగా ఐటీ బృందాలు సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. సంస్థ ఆదాయం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కాగా, ఫీనిక్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా.
ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అటు బీజేపీ నేతలు కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తెలంగాణలో గత ఎనిమిది ఏళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కమలం పార్టీ పెద్దలు.. అవినీతి బాగోతం మొత్తం బయటికి తీస్తామని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన రోజునే.. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది.
కవితే స్వయంగా డీల్ చేసిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ రచ్చ సాగుతుండగానే హైదరాబాద్ లోని టాప్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఒకటిగా ఉన్న ఫీనిక్స్ సంస్థల్లో ఐటీ సోదాలు జరగడం రాజకీయ సెగలు రేపుతోంది. మంత్రి కేటీఆర్ టార్గెట్ గానే ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఫీనిక్స్ గ్రూప్ చైర్మెన్ సురేష్ చుక్కపల్లి మంత్రి కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు.
ఫీనిక్స్ సంస్థలో కేటీఆర్ భారీగా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఫీనిక్స్ కు ప్రయోజనం కలిగేలా రూల్స్ కు విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. లిటిగేషన్ భూములను క్లియర్ చేసుకుంటూ ఫినిక్స్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచి ప్రభుత్వంలోని లిటిగేషన్ భూములను గుర్తించి.. వాటిని క్లియర్ చేసుకుందని గతంలో ఫిర్యాదులు వచ్చాయి.
చెరువులను కూడా కబ్జా చేశారంటూ ఫీనిక్స్ గ్రూప్ పై కొందరు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)ని కూడా అశ్రయించారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐీసీ ద్వారా భూముల కేటాయింపు జరిగిందని.. మంత్రి కేటీఆర్ కు సంబంధించిన సంస్థ కావడంతో అధికారులు ఆగమేఘాల మీద ఆ సంస్థకు భూములు కేటాయించారని విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి.
ఫినిక్స్ గ్రూప్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని దాదాపు 70 వేల కోట్ల రూపాయల విలువైన భూములను గత ఏడేళ్లగా అప్పనంగా అప్పగించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ప్రస్తుతం దాదాపు లక్షా 50 వేల కోట్ల వ్యాపారం చేస్తుందని తెలుస్తోంది. భోగి శ్రీధర్ రావు బినామీగా జరుగుతున్న అక్రమ దందాపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన పెద్దలు భారీగా అక్రమాలు జరుగుతున్నాయని నిర్ధారించారని తెలుస్తోంది.
బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు రాజకీయ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు ఫీనిక్స్ లో పెట్టుబడులు పెడతారనే టాక్ ఉంది. కాబట్టి కేటీఆర్ కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా అనేక ఆరోపణలు బీజేపీ నాయకులు ఎప్పటినుంచో చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈమధ్యనే కేసీఆర్ పై ఇంత పొడుగునా ఆరోపణల లిస్టు చదివాడు. కేటీఆర్ మీద గతంలో రేవంత్ రెడ్డి ఫామ్ హౌజ్ ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణల్లో నిజానిజాలేమిటో సామాన్యులకు తెలియవుగానీ కేసీఆర్ కుటుంబం పత్తిత్తు కాదని మాత్రం ప్రచారం ఉంది. కేసీఆర్ ఒకవేళ ప్రధాని మోడీతో సఖ్యతగా ఉంటే ఈడీ, ఐటీ అన్ని మూసుకొని కూర్చుంటాయి. ఇకముందూ చెలరేగిపోతే కేంద్రం చుక్కలు చూపిస్తుంది. ఈమధ్య బెంగాల్లో అదే జరిగింది కదా.