వైసీపీ టార్గెట్‌గా కమలదళం వ్యూహాత్మక అడుగులు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ సొంతంగానే బాగా బలోపేతం కావాలనేది భారతీయ జనతా పార్టీకి చాలా కాలంగా ఉన్న ఆశ. ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి, ఏపీలో ఆ పార్టీకి ఎప్పటికీ…

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ సొంతంగానే బాగా బలోపేతం కావాలనేది భారతీయ జనతా పార్టీకి చాలా కాలంగా ఉన్న ఆశ. ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి, ఏపీలో ఆ పార్టీకి ఎప్పటికీ ఠికానా  ఉండదని అంతా అంచనా వేశారు.

అయితే ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు.. తెలుగుదేశం- జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న భాజపా… ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కూడా భాగస్వామి అయింది. అయితే.. ఈ బలాన్ని సాకుగా పెట్టుకుని కమలదళం.. రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేందుకు.. లేదా, ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తమలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులను నైతికంగా దెబ్బతీసేలా మైండ్ గేమ్ ఆడడం ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేసేలాగా బిజెపి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నదనే చర్చలు సాగుతున్నాయి. 

రెండు రోజుల కిందట ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నాయకుల గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన ముగ్గురు ఎంపీలు కమలదళంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. 

ఇప్పుడు మరో బిజెపి నాయకుడు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని లీకులు ఇస్తున్నారు. విలీనం కోసం కర్ణాటకలో ఉపముఖ్యమంత్రి  డికె శివకుమార్ ను కలిశారని కూడా పుకార్లు పుట్టాయి. గెలిచిన 11 మందిలో జగన్ వెంట ఎందరుంటారో, ఉండరో ఇంకా తేలలేదని, అందుకే డికె శివకుమార్ తో చర్చలు సాగించారనేది నల్లమిల్లి మాటల సారాంశం. 

అయితే ఆదినారాయణ రెడ్డి గానీ, నల్లమిల్లి గానీ వ్యూహాత్మకంగా వైసీపీని దెబ్బకొట్టడానికే ఇలా మాట్లాడుతున్నట్టు సమాచారం. వైసీపీలో ఉంటే కేసుల భయం ఉంటుంది. అలాగని నాయకులు తెదేపా, జనసేనల్లోకి వెళ్లలేరు. అయితే వ్యూహాత్మకంగా, వైసీపీని కాంగ్రెసులో కలిపేస్తారని ప్రచారంలో పెడితే.. ఆ పార్టీలోకి వెళ్లే వారు భవిష్యత్తు ఉండదనే భయంతో ఆగిపోతారని, ప్రత్యామ్నాయంగా భాజపాలో చేరడానికి ముందుకు వస్తారనేది వారి ఆలోచన అయి ఉండొచ్చునని ఒక వాదన వినిపిస్తోంది.

ఈ 18వ శాసనసభ సమయంలోనే రాష్ట్రంలో ఇంకా బలోపేతం కావాలని భాజపా అనుకోవడం తప్పు కాదు. అయితే.. వైసీపీ వారితో మైండ్ గేమ్ ఆడుతుండడమే తమాషా.!