ప్రేమికుల రోజున గర్ల్ ఫ్రెండ్ కి ఎలా ప్రపోజ్ చేద్దాం, ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఆమె మనసు గెలుచుకుందాం అని ఆలోచిస్తుంటారు కుర్రాళ్లు. తన ప్రేమను అంగీకరిస్తుందో లేదో అనే అనుమానం ఉన్నవాళ్లు కూడా లవర్స్ డే రోజున అటోఇటో తేల్చుకుందామని చూస్తుంటారు. ఔనన్నా కాదన్నా వన్ సైడ్ లవ్ ఆపేది లేదంటారు కొందరు, అదే టైమ్ లో లవ్ ఫెయిలైతే యాసిడ్ బాటిళ్ల వైపు చూస్తుంటారు మరికొందరు.
అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది అంతకుమించి. తన ప్రేయసి మనసు గెలుచుకునేందుకు, ఓ వ్యక్తి ఏకంగా క్షుద్ర పూజల్ని ఆశ్రయించాడు. 'ఆవాహయామి' అంటూ తన ప్రేయసిని క్షుద్ర పూజలతో వశీకరణం చేసుకోవాలనుకున్నాడేమో. నూజివీడుకు చెందిన ఈ వ్యక్తిని, బహుశా క్షుద్ర ప్రేమికుడు అని పిలవాలేమో.
సహజంగా అమ్మాయిలను మనవైపు తిప్పుకోవాలంటే వారి ఫొటో, వెంట్రుకలు, లేదా గోళ్లు తీసుకుని ఆవాహం చేసుకోవాలని చెబుతుంటారు బురిడీ బాబాలు. నూజివీడు లవర్ కి తగిలిన బురిడీ బాబా ఏకంగా ఆ అమ్మాయి తిరిగే కాలేజీ బస్సులోనే పూజ చేయించినట్టున్నాడు.
రాత్రి వేళ కాలేజీ బస్సులో ఎవరూ లేని సమయంలో ముగ్గువేసి, నిమ్మకాయలు, అన్నం ముద్దలు పెట్టి పూజలు చేశారు. తెల్లారేసరికి ఆ పిల్ల మనసు మారిపోతుంది చూస్కో అంటూ లవ్ గురు మస్కా కొట్టి వెళ్లిపోయి ఉంటాడు.
తెల్లవారిన తర్వాత కాలేజీ స్టూడెంట్స్ అందరూ హుషారుగా బస్సు ఎక్కడానికి వచ్చారు, తీరా ఆ పూజలు చేసిన ఆనవాళ్లు చూసి షాకయ్యారు. బస్సు నిండా కుంకుమలో ముంచి వేసిన హస్తం గుర్తుల్ని చూసి భయపడ్డారు. ఇంకేముంది, కాలేజీ యాజమాన్యం పిల్లల్ని మరో బస్సులో తరలించింది.
ఇది ప్రేమ పూజా, క్షుద్రపూజా, ప్రేమకోసం చేసిన క్షుద్రపూజా అని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ప్రేమికుల రోజు ముందు జరిగిన సంఘటన కావడంతో కచ్చితంగా లవర్ మనసు గెలుచుకోడానికే ఎవరో ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగా విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు.