టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకి అత్యంత దగ్గరి సన్నిహితుడుగా ముద్రపడిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు పై శాఖపరమైన చర్యలు తీసుకోవాడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. రిటైర్ అయ్యే వరకు వచ్చే ఇంక్రిమెంట్లను రద్దు చేయాలని.. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వ హయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో.. వైఎస్ జగన్ సర్కారు మూడేళ్ల క్రితం ఆయనను విధుల నుండి సస్పెండ్ చేసింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కేసు కూడా పెట్టింది.
సస్పెండ్ ను సవాల్ చేస్తూ వెంకటేశ్వర రావు సుప్రీం కోర్టు వెళ్లడంతో.. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయటంతో 2022 మే 19 తేదీన సాధారణ పరిపాలన శాఖకు ఆయన రిపోర్టు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. తర్వత కొన్ని రోజులకే ఆలిండియా సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారని ఆయనపై ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. అప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే జగన్ సర్కారుపై న్యాయపోరాటం చేస్తున్న వెంకటేశ్వరరావుకు తాజాగా కేంద్రం గట్టి షాక్ ఇచ్చినట్లయింది. రిటైర్ అయ్యేవరకూ వచ్చే ఇంక్రిమెంట్లను రద్దు చేయాలని కేంద్రం సిపారసు చేయడంతో ఏబీకి పెద్ద షాక్ నే అని చెప్పాలి. కేంద్రం సిపారసు ఏబీ వెంకటేశ్వరావు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.