బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీలో తాను చెప్పిందే అధిష్టానం మాటగా, అదే ఫైనల్ అని తరచూ అంటుంటారు. నిజమే కాబోలు అని అమాయకంగా బీజేపీ శ్రేణులు కూడా నమ్ముతుంటాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం. సుదీర్ఘ కాలంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉండడం, అధిష్టానం పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జీవీఎల్ మాటకు విలువ వుంది. దీంతో ఆయన మాటకు ఏపీ బీజేపీలో ఎదురు చెప్పేవాళ్లెవరూ లేరు.
దీన్ని సాకుగా తీసుకున్న జీవీఎల్ గత కొంత కాలంగా సొంత ఎజెండాతో ముందుకెళుతున్నారనే చర్చ బీజేపీలో అంతర్గతంగా సాగుతోంది. కాపు నాయకుడు దివంగత వంగవీటి మోహన్‌రంగా పేరును ఓ జిల్లాకు ఎందుకు పెట్టకూడదనే ప్రశ్నతో అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఎటాక్ చేస్తున్నారు. ఇదే విషయమై రాజ్యసభలో కూడా ఆయన ప్రస్తావించడం గమనార్హం.
కృష్ణా జిల్లాకు దివంగత ఎన్టీఆర్, అలాగే కడప జిల్లాకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడాన్ని ఆయన ప్రశ్నిస్తూ… కులపరంగా రెచ్చగొడుతూ, అలాగే రాజకీయంగా ప్రయోజనం పొందాలనే వ్యూహంతో జీవీఎల్ ముందుకెళుతున్నట్టు కనిపిస్తోంది.
వంగవీటి రంగా పేరును ఓ జిల్లాకు పెట్టాలనే డిమాండ్, నినాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ బీజేపీలోని కొందరి వాదన. బీజేపీ ఎప్పుడూ ఒక వ్యక్తిని ఆరాధించదనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్న జీవీఎల్… ఆ పార్లమెంట్ పరిధిలోని కాపుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే యత్నంలో భాగంగా బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళుతున్నారనే అభిప్రాయం ఆ పార్టీలో వుంది.
నిజంగా వంగవీటి రంగా పేరును ఓ జిల్లాకు పెట్టాలనే డిమాండ్ ఒక రాజకీయ పార్టీగా బీజేపీ చేయలేదని, భవిష్యత్‌లో చేయబోదని ఆ పార్టీ నాయకులు తేల్చి చెబుతున్నారు. ఇది కేవలం జీవీఎల్ వ్యక్తిగత ఎజెండానే అని ఏపీ బీజేపీలోని జీవీఎల్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల నేతలు స్పష్టం చేస్తున్నారు. నిజంగా వంగవీటిపై జీవీఎల్‌కు ప్రేమాభిమానాలు వుంటే… ఆయన పేరు విషయమై పార్టీతో తీర్మానం చేయించాలని సవాల్ విసురుతున్నారు. జీవీఎల్ చిత్తశుద్ధిని చాటుకోవాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం.