మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి కలిగిన వాసిరెడ్డి పద్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రోడ్డున పడేసిందన్నారు. ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో లైంగిక దాడికి గురైన మానసిక వికలాంగురాలి పరామర్శ తీవ్ర వివాదానికి దారితీసింది.
బాధితురాలి ఎదుట వాసిరెడ్డి పద్మ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనను బొండా ఉమా నోర్మూయ్ అని పరుషంగా మాట్లాడారని, అలాగే చంద్రబాబునాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమాను ఉద్దేశించి ఆకురౌడీ అని ఘాటు పదాలతో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని చంద్రబాబు, బొండా ఉమాలకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారు.
మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడిపై సోమవారం కలెక్టర్‌కు బొండా ఉమా నేతృత్వంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఓరేయ్, ఒరేయ్ అంటూ పద్మ పరుషంగా మాట్లాడ్డంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. తాము కూడా ఒసేయ్ అని మాట్లాడగలమని హెచ్చరించారు. పద్మ బజారు మనిషలా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. వాసిరెడ్డి పద్మ భాష ఏంటని నిలదీశారు. వాసిరెడ్డి పద్మ అహంకారం ఏంటని ప్రశ్నించారు.
అసలు తమకు నోటీసులు ఇచ్చే హక్కే వాసిరెడ్డి పద్మకు లేదన్నారు. తాము విచారణకు హాజరయ్యే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. వాసిరెడ్డి పద్మను ఆ పదవి నుంచి తప్పించే వరకూ న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పద్మకు ఎందుకంత అహంకారం అని ఆయన నిలదీశారు.
బాధితురాలికి టీడీపీ అండగా నిలబడకపోతే న్యాయం జరిగేదా? అని ప్రశ్నించారు. మానసిక వికలాంగురాలి శీలానికి ప్రభుత్వం వెల కట్టి చేతులు దులుపుకుందన్నారు. బాధితుల పక్షాన నిలిచిన తమకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. విచారణకు ఎట్లా రారో చూస్తానని సవాల్ విసురుతున్నారని గుర్తు చేశారు. వాసిరెడ్డి పద్మ వల్లే జగన్ రోడ్డున పడ్డారన్నారు.
జగన్‌కు శత్రువులు ఎక్కడో లేరన్నారు. వాసిరెడ్డి పద్మ పబ్లిసిటీ వల్లే జగన్ ఇవాళ రోడ్డున పడాల్సిన వచ్చిందని విమర్శించారు. సంఘటన జరిగి మూడు రోజులైనా, మేకప్‌లు వేసుకుంటూ గడిపారన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలిని పరామర్శించడానికి చంద్రబాబు వస్తే… మేకప్ వేసుకొచ్చిన పద్మ రచ్చరచ్చ చేశారని విరుచుకుపడ్డారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమకు నోటీసులు ఇచ్చారని ఆయన విమర్శించారు.