విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. అందమైన నగరం. ఏపీలో మెగా సిటీ కూడా. దాంతో కొత్త మంత్రులు వరసబెట్టి విశాఖ టూర్లు చేస్తున్నారు. నిన్ననే టూరిజం మంత్రి ఆర్కే రోజా విశాఖ వచ్చి సందడి చేశారు. వస్తూనే ఆమె సింహాచలం వెళ్లారు. అదే రూట్లో ఉన్న శారదాపీఠానికి వెళ్లి మరీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.
ఇపుడు మరో మహిళా మంత్రి విడదల రజనీ విశాఖ వచ్చారు. ఆమె విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రిగా కూడా నియమితులయ్యారు. ఆమె విశాఖ వచ్చీ రావడంతోనే నేరుగా పీఠానికే వెళ్ళారు. స్వామీజీ దీవెనలు ఆమె కోరుకున్నారు. స్వామి సైతం ఆమెకు చీర బహూకరించి అశీర్వదించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కోసం రజనీ ప్రత్యేక అర్చనలు చేశారు.
మరో వైపు చూస్తే విశాఖకు ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, సమాచార మంత్రి వేణుగోపాలక్రిష్ణ కూడా వచ్చి ఆలయాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది మంత్రులు విశాఖ వస్తారని అంటున్నారు.
వీరంతా సింహాద్రి అప్పన్న ఆలయాన్ని దర్శించడంతో పాటు నేరుగా స్వామీజీ ఆశ్రమానికే వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ ని తీసుకుంటున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా విశాఖ టూర్ పెట్టుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా మరోసారి విశాఖ రాబోతున్నారు.
మొత్తానికి చూస్తే ఈ హడావుడితో రాజకీయ రాజధానిగా విశాఖ అయితే మారుతోంది అని చెప్పాల్సిందే.