బీజేపీ రహిత రాజకీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవహారశైలిపై విమర్శలొస్తున్నాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మినహాయింపు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ మధ్య మంచి సంబంధాలున్నాయి.
ఇక తెలంగాణ విషయానికి వెళితే… ఉప్పు, నిప్పులా పరిస్థితి ఉంది. మన పొరుగునే ఉన్న తమిళనాడులోనూ గవర్నర్, ప్రభుత్వం మధ్య పొసగడం లేదు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గవర్నర్లతో ఆయా ప్రభుత్వాలకు ఏ మాత్రం సఖ్యత లేదు.
ఈ నేపథ్యంలో తమిళనాడులో గవర్నర్ అధికారాలకు కోత విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించే గవర్నర్ అధికారాలను కట్ చేసింది. ఇకపై వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్టం తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు చట్టసవరణ బిల్లును స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టింది.
ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో కీలక ఉపన్యాసం చేశారు. ప్రభుత్వంతో చర్చించి వీసీలను గవర్నర్ నియమించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. కానీ వీసీలను నియమించడం తమ హక్కుగా గవర్నర్లు భావిస్తూ వస్తున్నారన్నారు. ఈ ధోరణి ప్రభుత్వాన్నే గాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా అగౌరవపరిచినట్టే అన్నారు.
వీసీల నియామక అధికారం ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా వీసీలను గవర్నర్ సొంతంగా నియమించరని గుర్తు చేశారు. గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురిలో ఒకరిని వీసీగా గవర్నర్ నియమిస్తారని స్టాలిన్ చెప్పుకొచ్చారు.
తాజా నిర్ణయంతో గవర్నర్, తమిళనాడు సర్కార్ మధ్య మరింత గ్యాప్ పెరిగినట్టైంది. ఇటీవల గవర్నర్ టీ పార్టీకి ఆహ్వానించినా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు మంత్రులెవరూ వెళ్లలేదు.