ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి తమపై ఫిర్యాదు చేయడాన్ని ఏపీ సర్కార్ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు కామెంట్స్ చేశారు. భుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, ఇతర ఆర్థిక చెల్లింపులు జరిగేలా, అలాగే ప్రభుత్వ ఆదాయంలో మొదటి హక్కుదారుగా ఉద్యోగులుండేలా చట్టం చేయాలని కోరుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, జి.ఆస్కారరావు తదితరులు విజ్ఞప్తి చేశారు. జగన్ సర్కార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ వ్యవహారం కాస్త ఉద్యోగులు, ఎన్జీవోల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఓ చానల్ డిబేట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన సీరియస్‌గానే కామెడీ చేయడం గమనార్హం. తమ ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా చెప్పుకొచ్చారు. ఉద్యోగస్తులు తమ కుటుంబ సభ్యులన్నారు. ఉద్యోగులు ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు. వాటిని పరిష్కరించడానికే ప్రయత్నిస్తున్నామన్నారు.
గవర్నర్‌ను ఉద్యోగ సంఘాల నాయకులు కలవడం చూసి ఆశ్చర్యపోయినట్టు మంత్రి తెలిపారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్న సమస్య ఏమైనా ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిందా? అని నిలదీశారు. ఈ సమస్యను ప్రభుత్వం క్రియేట్ చేసిందా? అదేం కాదు కదా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ఏమైనా ఇందులో తలదూర్చి పరిష్కరించే అవకాశం రాజ్యాంగబద్ధంగా ఉందా? అదేం లేదు కదా! అని ఆయన అన్నారు.
ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారా అనేది వాళ్ల ఇష్టమన్నారు. కానీ నిబంధనల ప్రకారం ఇది చాలా తప్పు అని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు చేసిన పని క్షమించరాని నేరమని ఘాటు వ్యాఖ్య చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరువు, ప్రతిష్టలతో పాటు ఉద్యోగుల గౌరవాన్ని పోగొట్టుకోవాలని అనుకోవడం సరైంది కాదన్నారు. ఎవరో ఒక వ్యక్తి వల్ల ఉద్యోగులందరికీ చెడ్డపేరు రాకూడదన్నారు. ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. చేసింది తప్పని, తొందర పాటు చర్య అని ఉద్యోగ సంఘ నాయకుడు సూర్యనారాయణ ప్రకటించాలని హితవు చెప్పడం గమనార్హం.