జనసేనాని పవన్‌కల్యాణ్ విషయంలో బీజేపీ స్వరం మారింది. బీజేపీకి జనసేన పార్టీ ఇప్పటికీ మిత్రపక్షమే. ఇది అధికారికంగా చెప్పుకోడానికే తప్ప, ఆచరణలో కాదనే సంగతి తెలిసిందే. అయితే ఇంత కాలం 2024లో జనసేనతో కలిసే వెళ్తామని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇటీవల చంద్రబాబునాయుడితో పవన్ భేటీ కావడం, టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్‌కల్యాణ్ బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే.
పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఇంత వరకూ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇవాళ పవన్‌కల్యాణ్‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ తమతో కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్‌పై బీజేపీ ఆశలు వదులుకుందని చెప్పేందుకు సోము వీర్రాజు తాజా కామెంట్స్ నిదర్శనం. పవన్‌తో కలసి వెళ్తామని వీర్రాజు ధీమాగా చెప్పకపోవడాన్ని గమనించొచ్చు.
ఎందుకంటే కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతామని, ఎన్నికల్లో ఫైట్ చేస్తామనే ఏకైక డిమాండ్‌తో బీజేపీ ముందుకెళ్తోంది. టీడీపీ, వైసీపీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వెళ్లే ప్రసక్తే లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. కానీ టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీపై పవన్ ఒత్తిడి తెస్తున్నారు. అవేవీ బీజేపీపై పని చేయడం లేదు. టీడీపీతో కాకుండా, బీజేపీతో కలిసి పోటీ చేస్తే చివరికి తాను కూడా మరోసారి గెలవలేననే భయం పవన్‌ను వెంటాడుతోంది.
అందుకే ఆయన బీజేపీని విడిచి, టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి మిత్రపక్షమైన జనసేనను కూడా దూరంగా పెట్టేందుకు వెనుకాడమనే సంకేతాల్ని సోము వీర్రాజు పరోక్షంగా ఇచ్చారు.