తెలుగు నాట సినిమా కలెక్షన్లు అన్నవి ఓ బ్రహ్మ పదార్ధం. నిర్మాతకు తప్ప మరెవ్వరికి అస్సలు నిజం తెలియదు. అమెరికాలో అలా కాదు..పక్కా లెక్క తేలిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇష్టం వచ్చిన ఫిగర్లు చలామణీ అయిపోతాయి. ఫ్యాన్స్ ఓ తరహా ఫిగర్లు చలామణీ చేస్తే, మీడియాలో రకరకాల లెక్కలు కనిపిస్తుంటాయి. హీరోల కోసం రకరకాల ఫిగర్లతో పోస్టర్లు వేస్తుంటారు. తరువాత ఎవరైనా నిలదీస్తే..తూచ్..ఉత్తుత్తినే,..ఫ్యాన్స్ కోసం అంటారు.
అయితే జీఎస్టీ వచ్చిన తరువాత ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో బ్లాక్ బిజినెస్ తగ్గుతోంది. దాదాపు తొంభై శాతం వైట్ బిజినెస్ నే జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో నైజాంలో తమ వరకు లెక్లకు పక్కాగా వుండేందుకు ఓ యాప్ ను తయారు చేసే పనిలో వుందట కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన మైత్రీ. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలను ఫుల్ వైట్ తో డిస్ట్రిబ్యూట్ చేసారు.
కానీ కొన్ని చోట్ల థియేటర్ల చిలక్కొట్టుళ్లు కూడా కనిపించాయి. వాటిని పట్టుకున్నారు కూడా. షో కి ఇరవై నుంచి వంద టికెట్ ల వరకు నొక్కేయడం అన్నమాట. ఇవన్నీ పట్టుకున్నాక, ఈ యాప్ ఐడియా వచ్చిందట. ఎగ్జిబిటర్ల ఫోన్ లో యాప్ లోడ్ చేస్తారు. షో స్టార్ట్ కాగానే ఎన్ని టికెట్ లు తెగాయి అన్నది అందులో లోడ్ చేయాల్సి వుంటుంది.
ప్రతి షో కాగానే నైజాంలో అప్పటి కలెక్షన్ ఎంత అన్నది క్లారిటీగా తెలిసిపోతుందన్నమాట. ప్రస్తుతానికి ఈ యాప్ మైత్రీ సంస్థ పంపిణీ చేసే సినిమాలకే పరిమితం. తరువాత తరువాత దీన్ని మరింత డెవలప్ చేసి, టికెట్ కట్ చేయగానే తెలిసేలా కూడా చేయాలన్న ప్లాన్ వుందని తెలుస్తోంది.