ఆయన విద్యాశాఖ మంత్రి కేజీ టూ పీజీ వరకూ అంతా నడిపించాల్సిన మంత్రిగారు. అయితే విద్యా శాఖను చేపట్టడం ఆయనకు ఇష్టం ఉందో లేదో కానీ ఇచ్చేశారు.
ఇక ఆయన బాధ్యతలు తీసుకుని మూడు నెలలు పై దాటింది. ఇప్పటికీ మీడియా అడిగే కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదు అధికారులను కనుక్కుంటాను అని అనడం సీనియర్ మంత్రిగా తగునా బొత్స సత్యనారాయణగారూ అని అంటున్నారు.
విదేశీ విద్యా నిధి పధకానికి జగనన్న పేరు పెట్టారని మీడియా అడిగిన దానికి బదులిస్తూ అవునా అది నాకు తెలియదే అని చాలా లైట్ తీసుకున్నారు బొత్స. అధికారులను కనుక్కుని చెబుతాను అని అంటున్నారు. అయినా జగనన్న పేరు పెడితే తప్పేంటి అని కూడా మంత్రి గారే మరో వైపు అంటున్నారు.
ఇక దీని కంటే ముందు ఒకసారి మీడియా సమావేశాన పాఠశాలల విలీనానికి సంబంధించి జీవో 117 మీద కూడా తనకు ఏముందో తెలియదని మంత్రి అని ఆనక సవరణలు చేస్తామని చెప్పుకొచ్చారు.
కీలకమైన శాఖ విద్యా శాఖ. పైగా ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టిన శాఖ. కేంద్రం కూడా జాతీయ విద్యా విధానం అమలు చేయాలనుకుంటోంది. అలాంటి శాఖ విషయంలో మంత్రి గారు ఆసక్తి అనురక్తి పెంచుకుంటే అబ్బే నాకు తెలియదే అని అధికారుల వైపు పదే పదే చూడడం అనే బాధ తప్పుతుంది కదా.
ఇక ఏపీలో ఒక్క స్కూల్ కూడా మూసేయమని మంత్రి చెప్పారు. అది చాలా బాగుంది. అంతే కాదు ప్రతీ 21 మంది పిల్లలకు ఒక టీచర్ ని నియమిస్తామని, విలీనం ద్వారా దూరాభారమైన 270 దాకా ఉన్న స్కూళ్ల విషయంలో తగిన పరిష్కారం కనుగొంటామని బొత్స చెప్పడం కూడా జనాలకు ఊరటను ఇచ్చేదే.
విద్యా శాఖ విషయంలో బొత్స కాస్తా దృష్టి పెడితే ఆయనకు ఇది కొట్టిన పిండి అవుతుంది, అంతే కాదు సీనియర్ మంత్రిగా ఆయన న్యాయం చేయగలరు కూడా.