ఎన్‌డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్(71) పేరు ఖరారైంది. నామినేషన్ దాఖలుకు మంగళవారం తుది గడువు.
ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా జగదీప్ పేరు ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. రైతు కుటుంబానికి చెందిన జగదీప్‌ను ఉపరాష్ట్రపతి బరిలో నిలపనున్నట్టు నడ్డా ప్రకటించడం గమనార్హం.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం శనివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశానికి జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్, గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రేస్‌లో కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. దీంతో బీజేపీ పార్లమెంటరీ సమావేశం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా పశ్చిమబెంగాల్ గవర్నర్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ రాష్ట్రంలో మమతాబెనర్జీ, జగదీప్ మధ్య ఓ రేంజ్‌లో పోరు జరిగింది. నిత్యం వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నట్టు ఆయనపై మమతా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగదీప్ రాజస్థాన్ రాష్ట్ర నివాసి. జాట్ల సామాజిక వర్గానికి చెందిన నేత. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఆ సామాజిక వర్గం బలంగా ఉంది. బీజేపీపై ఆ సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన జగదీప్‌ను ఎంపిక చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.