ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి తీవ్ర వివాదాస్పదం చేస్తోంది. ప్రజల భూములు లాక్కోడానికి జగన్ సర్కార్ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని టీడీపీ, జనసేన అగ్రనేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ చట్టంపై ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో వైసీపీ విఫలమైందన్న అభిప్రాయం బలపడుతోంది. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిప్పి కొట్టారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశమంతా ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సూచించిందని ఆయన అన్నారు. ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా చట్టం తయారు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. భూములకు సంబంధించి దళారి వ్యవస్థకు చోటు లేకుండా చట్టాన్ని తెస్తున్నట్టు ఆయన వివరించారు.
రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్స్ ఇవ్వరనే ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారని, అది పచ్చి అబద్ధమన్నారు. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే వాళ్లమని ఆయన హెచ్చరించారు.
అయితే ఇంకా చట్టం అమల్లోకి రాకుండానే, దాన్ని తొలగిస్తామని ప్రతిపక్షాల నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స అన్నారు. ఈ యాక్ట్ అమలు చేయడానికి ముందు ప్రజాభిప్రాయం తీసుకుంటామన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ , రామోజీ, రాధాకృష్ణ క్రిమినల్స్‌లాగా మాట్లాడుతున్నారని బొత్స దుయ్యబట్టారు.