ఆయన వైసీపీలో సీనియర్ మంత్రి. ఉత్తరాంధ్రా జిల్లాల్లో రాజకీయంగా సామాజికంగా పలుకుబడి కలిగిన నాయకుడు. పలు మార్లు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. ఆయనే బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణకి మంత్రి వర్గ విస్తరణలో విద్యా శాఖ లభించింది. దాంతో ఆయన అసంతృప్తికి లోను అయ్యారని ప్రచారం అయితే సాగుతోంది.
కొత్త మంత్రులా ప్రమాణాలూ, శాఖల కేటాయింపులూ కూడా జరిగి వారం రోజులు పై దాటినా బొత్స మాత్రం తన శాఖకు సంబంధించి ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. దానికి కారణం ఆయనకు మక్కువ లేకపోవడమే అని కూడా అంటున్నారు. దాంతో ఆయన తనకు గతంలో చేసిన మునిసిపల్ శాఖనే కేటాయించాలని కోరుతున్నాట్లుగా చెబుతున్నారు.
కొత్త శాఖ పట్ల అవగాహన పెంచుకుని గాడిలో పెట్టాలంటే చాలా కాలం అవుతుందని ఆయన భావనగా చెబుతున్నారు. అందువల్ల విద్యా శాఖను గతంలో చూసిన ఆదిమూలపు సురేష్ కి ఇచ్చేసి ఆయనకు ఇచ్చిన మునిసిపల్ శాఖను తనకు తిరిగి ఇచ్చేలా చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
మరి మంత్రుల ఎంపిక నుంచి శాఖల కేటాయింపు వరకూ తన మార్క్ ని చాటుకున్న జగన్ ఇపుడు ఇలా శాఖల మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఇంతటితో ఆగుతుందా అన్న చర్చ కూడా ఉంది. అంతే కాదు, సీనియర్ అనే విద్యా శాఖను బొత్సకు అప్పగించారు అని అంటున్నారు.
నాడు నేడు వంటి ఘనమైన కార్యక్రమాలు ఇపుడు ఆ శాఖలో సాగుతున్నాయి. పైగా కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. దాంతో విద్యా శాఖలో కీలక మార్పు చేర్పులకు ఇదే తరుణం అయినందువల్ల సీనియర్ మంత్రి ఉండాలనే జగన్ బొత్సకు ఈ బాధ్యతలు ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి చూస్తే బొత్స కోరికను జగన్ తీరుస్తారా అన్నది ఇపుడు ఉత్కంఠను రేపే అంశంగా అంతా చూస్తున్నారు.