భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పరువును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేజేతులా తీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు దిగజారుడు రాజకీయాల పుణ్యమా అని అధినేతల కుటుంబాల్లోని మహిళలను రాజకీయాల్లోకి లాగుతున్నారు. అయితే టీడీపీ దుష్టపన్నాగం భూమరాంగ్ అయ్యింది. సీఎం సతీమణి వైఎస్ భారతీపై టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతుండడంతో వైసీపీ నేతలు కూడా ఎదురు దాడికి దిగారు. ఇది కాస్త శ్రుతిమించుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో వైఎస్ భారతికి సంబంధం ఉందని టీడీపీ నేతల నిరాధార ఆరోపణల నేపథ్యంలో వైసీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలతోనైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన టీడీపీ నేతలు, ఉద్దేశ పూర్వకంగా పదేపదే భారతిని టార్గెట్ చేయడం వైసీపీలో ఆగ్రహం కట్టలు తెచ్చుకునేలా చేసింది. దీంతో వైసీపీ నేతలు కూడా బాబు కుటుంబంలోని మహిళలపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టి భువనేశ్వరి, బ్రాహ్మణిలను బజారుకీడ్చడంలో పరోక్షంగా చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
“రాష్ట్రంలో మద్యం బ్రాండ్లన్నీ బాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి (బీ–3) బ్రాండ్లేనని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ (మాల) కార్పొరేషన్ చైర్ పర్సన్ పి.అమ్మాజీ విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మద్యం తాగడంలో స్వయంగా అత్తా కోడళ్లు పోటీ పడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో ఇటీవల అత్తాకోడళ్లు కొట్టుకున్నట్టు వార్తలొచ్చాయని సంచలన విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతికి సంబంధాలున్నాయని టీడీపీ విమర్శలకు వైసీపీ ఘాటు రియాక్షన్ అది.
ఈ వ్యవహారం పక్కదారి పట్టిందని గ్రహించి టీడీపీ నేతలు మౌనంగా ఉండి వుంటే బాగుండేది. కానీ ఇవాళ కూడా వైఎస్ భారతిపై అవే ఆరోపణలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేయడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి దేశమంతా భారతి, విజయసాయిరెడ్డి పాత్రల గురించే మాట్లాడుకుంటోందని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. ఈ స్కాంపై సమాధానం చెప్పుకోలేని సీఎం జగన్, చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఎదురుదాడి చేయించటం సిగ్గుచేటన్నారు. రాజకీయ పదవుల కోసం దిగజారి ఆరోపణలు చేసే మహిళా నేతలు వారి గౌరవన్ని తగ్గించుకునేలా ప్రవర్తించటం నీచాతి నీచమన్నారు.
భువనేశ్వరి, బ్రాహ్మణిలపై మనసు చంపుకుని చేసే విమర్శల ద్వారా మరింత పతనమవుతున్నారని కొల్లు రవీంధ్ర అన్నారు. చంద్రబాబు భార్య, కోడల్ని విమర్శిస్తే మాత్రం తెగబాధపడుతున్నారు. ఎదుటి పార్టీల మహిళలను టార్గెట్ చేసినపుడు ఇదే రకమైన బాధ వుంటుందని అర్థం చేసుకుని వుంటే టీడీపీ నేతలు దిగజారి వ్యవహరించే వారు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.