ఎంతైనా ఆయ‌న రాజ‌కీయ గురువు!

రాజ‌కీయాల్లో దేన్ని ఎలా వాడుకోవాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి నుంచి నేర్చుకోవాలి. విలువ‌లు, తొక్క తోలు అని ఎవ‌రైనా భీష్మించుకుని కూచుంటే అంతే సంగ‌తులనే జీవిత స‌త్యాన్ని కూడా ఆయ‌న నుంచే నేర్చుకోవాలి. ఇవాళ…

రాజ‌కీయాల్లో దేన్ని ఎలా వాడుకోవాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి నుంచి నేర్చుకోవాలి. విలువ‌లు, తొక్క తోలు అని ఎవ‌రైనా భీష్మించుకుని కూచుంటే అంతే సంగ‌తులనే జీవిత స‌త్యాన్ని కూడా ఆయ‌న నుంచే నేర్చుకోవాలి. ఇవాళ గురుపూజోత్స‌వం దినం. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడు వ‌రుస ట్వీట్ల‌ను చేశారు.

ప‌లు కార‌ణాల వ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ఉద్య‌మానికి ఉపాధ్యాయులు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇవాళ ప్ర‌భుత్వం నిర్వ‌హించే గురుపూజోత్స‌వ వేడుక‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వంపై ఉపాధ్యాయుల ఆగ్ర‌హాన్ని రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే క్ర‌మంలో వారిపై అలివిమాలిన ప్రేమ‌ను చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శించ‌డం చర్చ‌నీయాంశ‌మైంది.

ఒక‌వైపు గురువుల గొప్ప‌త‌నాన్ని ప్ర‌శంసిస్తూ, మ‌రోవైపు వారిప‌ట్ల ప్ర‌భుత్వ వైఖ‌రిని తూర్పార ప‌ట్టిన తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బాబు ట్వీట్ల‌లో ఏముందో తెలుసుకుందాం.

“పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే మహత్కార్యాన్ని నిర్వర్తిస్తోన్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువును దైవంగా భావించే సమాజం మనది. తలెత్తుకు జీవించే గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయులు ఏపీలో ఈ రోజు ప్రభుత్వ కక్ష సాధింపుకు గురవుతుండటం దురదృష్టకరం”

“గురుపూజోత్సవం వేళా గురువులకు జీతాల చెల్లింపు చెయ్యక పోవడమే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవమా? సిపిఎస్‌ రద్దు కోసం అడగకూడదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అప్పు కోసం తాకట్టు పెట్టినా నోరెత్తకూడదు. పాఠశాలల విలీనం పేరిట విద్యను బాలబాలికలకు దూరం చేస్తుంటే మాట్లాడకూడదు”

ఇలా సాగాయి చంద్ర‌బాబు ట్వీట్లు. స‌హ‌జంగానే జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌తో ఉన్న ఉపాధ్యాయుల‌ను ఆయ‌న ప్ర‌త్య‌ర్థి సానుకూల ట్వీట్లు ఆక‌ర్షించాయి. ప్ర‌తి అవ‌కాశాన్ని ఎలా వాడుకోవాలో చంద్ర‌బాబు తాజా ట్వీట్లే నిద‌ర్శ‌నం. రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న మాస్టారు మ‌న చంద్ర‌బాబు అంటే కాద‌న‌గ‌ల‌రా?