తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం చర్చకు దారి తీసింది. సోదరి డాక్టర్ సునీతకు అనుకూలంగా ఆ వాంగ్మూలం ఉన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొనడం సహజంగానే చర్చనీయాంశమైంది. అన్నతో విభేదించిన చెల్లెలిద్దరూ ఒకే మాట, ఒకే బాట అన్నట్టు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలకి బలం కలిగిస్తోంది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతుందో, జరగబోతున్నదో టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. విచారణను ఆంధ్రా నుంచి తెలంగాణకు మార్చాలని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తీర్పు వెలువరించాల్సి వుంది.
ఈ నేపథ్యంలో కడప ఎంపీ, సీఎం జగన్ సోదరుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జోస్యం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారని ఆయన తేల్చి చెప్పారు. బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి ప్రాణ భయంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
తనకు ప్రాణ భయం వుందని దస్తగిరి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటి కుక్కను చంపడం, అలాగే గన్‌మెన్లను మార్చడంతో దస్తగిరి పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. తనకేం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాల్సి వుంటుందని దస్తగిరి హెచ్చరించిన నేపథ్యంలో బీటెక్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. సీఎం బాధ్యత వహించాల్సి వుంటుందని దస్తగిరి ఆరోపణలను చూస్తే సీఎం జగన్ పాత్ర వుందని అనుమానం వస్తోందని బీటెక్ రవి చెప్పారు.
వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలం సునీతకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న నేతల ప్రమేయాన్ని షర్మిల సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం ఉందని బీటెక్ రవి స్పష్టం చేశారు. షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఎప్పుడిచ్చారు? ఏమిచ్చారనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
షర్మిల వాంగ్మూలంలో ఏమున్నదో బీటెక్ రవికి ఎలా తెలుసు? తదితర ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. షర్మిల వాంగ్మూలంపై బీటెక్ రవి కామెంట్స్ నేపథ్యంలో మరోసారి వివేకా హత్య కేసు విచారణ సంచలనం రేకెత్తే అవకాశం ఉంది.