మద్యంపై ఎవరు నీతులు చెప్పినా ఎబ్బెట్టుగా వుంటుంది. రాజకీయాల కోసమైనా మద్యం గురించి మాట్లాడకపోవడం ఉత్తమం. ఎందుకంటే అందరూ ఆ మత్తులో దొర్లుతున్న బాపతే. అదేంటోగానీ, ఈ వాస్తవం తెలిసి కూడా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్యం ప్రవచనాలు వల్లిస్తున్నారు.
మద్యంపై ఈటల రాజేందర్ కోతలేంటో తప్పక తెలుసుకోవాల్సిందే. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ప్రజల్ని తాగుబోతుల్ని చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఈటల విమర్శించారు. మంత్రుల్ని పంపి, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఈటల హితవు ఓ రేంజ్‌లో వుంది.
‘మంత్రులూ.. మీరు తాగితే తాగండి ప్రజల్ని చెడగొట్టకండి’ అంటూ ఈటల హితవు పలకడం చర్చనీయాంశమైంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు, మందుబాబులకి పండుగే. ప్రజల్ని మద్యం మత్తులో ముంచడంలో ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. మద్యం పంపిణీ చేయకపోతే ప్రచారానికి వచ్చే వాళ్లు ఎందరో ఒకసారి ఈటల పరీక్షిస్తే బాగుంటుంది. బీజేపీ నేతలెవరూ మద్యం ముట్టుకోని సన్యాసులైనట్టు ఈటల ఉపన్యాసాలివ్వడం గమనార్హం.
మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు రాజకీయ పార్టీలన్నీ ముందుకొస్తే మంచిదే. కానీ రాజకీయ పార్టీలు అలా చేయవు. ఎందుకంటే ప్రజలు మత్తులో వుంటేనే తమ ఆగడాలకు అడ్డు వుండదనే వాస్తవం నేతలకు తెలుసు. ఏదో విమర్శ కోసమే అన్నట్టు నోటికి ఏదొస్తే, అది మాట్లాడ్డం నేతలకే చెల్లు.