బిల్డ‌ప్ బీటెక్ ర‌వి పాచిక పార‌లేదు!

పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వి పాచిక ఇడుపుల‌పాయ‌లో పార‌లేదు. ఇడుపుల‌పాయ స‌ర్పంచ్ మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ పంచాయ‌తీ వైఎస్సార్ ఎస్టేట్ ప‌రిధిలో ఉండ‌డంతో ఉప ఎన్నిక ప్రాధాన్యం…

పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వి పాచిక ఇడుపుల‌పాయ‌లో పార‌లేదు. ఇడుపుల‌పాయ స‌ర్పంచ్ మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ పంచాయ‌తీ వైఎస్సార్ ఎస్టేట్ ప‌రిధిలో ఉండ‌డంతో ఉప ఎన్నిక ప్రాధాన్యం సంత‌రించుకుంది. వైనాట్ పులివెందుల నినాదంతో టీడీపీ జోష్ మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇడుపుల‌పాయ స‌ర్పంచ్ స్థానాన్ని గెలుచుకుని ఇక పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారాన్ని పెద్ద ఎత్తున సాగించాల‌ని టీడీపీ భావించింది.

అయితే ఇడుపుల‌పాయ‌లో టీడీపీకి అంత సీన్ లేదు. క‌నీసం నామినేష‌న్‌ను కూడా స‌క్ర‌మంగా వేసుకోలేని ప‌రిస్థితి. ఇక్క‌డ వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌ధానంగా వేంప‌ల్లె జెడ్పీటీసీ స‌భ్యుడు ర‌వికుమార్‌రెడ్డి ప్లాన్‌గా వ్య‌వ‌హ‌రించి టీడీపీని బోల్తా కొట్టించారు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ స్థాన‌మైన  ఇక్క‌డ వైసీపీ మ‌ద్ద‌తుతో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి గ‌న్‌మ‌న్ ర‌మ‌ణ త‌ల్లి తుమ్మ‌లూరు నాగ‌మ్మ నామినేష‌న్ వేశారు. టీడీపీ త‌ర‌పున ల‌క్ష్మ‌ణ్‌ను బ‌రిలో దింపాల‌ని నిర్ణ‌యించారు.

టీడీపీ మ‌ద్ద‌తుదారుడైన ల‌క్ష్మ‌ణ్ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డంతో ఏక‌గ్రీవమే తరువాయి. అయితే టీడీపీని ఎదుర్కోలేక త‌మ అభ్య‌ర్థి నామినేష‌న్‌ను తిర‌స్క‌రించార‌ని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి ఆరోప‌ణ‌. ఇంటి ప‌న్ను చెల్లింపు వివ‌రాలు ఇవ్వ‌క‌పోవ‌డం, అలాగే ఓట‌రు జాబితాలో , నామినేష‌న్‌లో అభ్య‌ర్థి వివ‌రాలు వేర్వేరుగా ఉన్నాయ‌ని, అలాగే ప్ర‌తిపాద‌కుల ఓట‌రు నంబ‌ర్ల‌ను త‌ప్పుగా న‌మోదు చేయ‌డంతో తిర‌స్క‌రించిన‌ట్టు ఎన్నిక‌ల అధికారి తెలిపారు.

ఎంపీడీవో మ‌ల్లికార్జున్ ఉద్దేశ పూర్వకంగానే ఇంటి ప‌న్ను వివ‌రాలు ఇవ్వ‌లేద‌ని బీటెక్ ఆరోప‌ణ‌. బీటెక్ ర‌వి ఆరోప‌ణ‌ల‌ను వైసీపీ బ‌లంగా తిప్పికొడుతోంది. క్యాస్ట్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి ఇబ్బంది పెట్ట‌ని తాము, ఇత‌ర‌త్రా అడ్డంకులు ఎందుకు సృష్టిస్తామ‌ని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. ఇంటి ప‌న్ను చెల్లింపున‌కు సంబంధించి రిసిప్టులు ల‌క్ష్మ‌ణ్ వ‌ద్దే వుంటాయ‌ని, లేవంటే చెల్లించ‌లేద‌ని అర్థం చేసుకోవాల్సి వుంటుంద‌ని వైసీపీ నేత‌లు వాదిస్తున్నారు.

బీటెక్ ర‌వి ఉద్దేశ పూర్వ‌కంగానే ర‌చ్చ పెట్టుకుని, రాష్ట్ర వ్యాప్తంగా ఇడుపుల‌పాయ‌ను వివాదంలోకి నెట్టేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని, ఆయ‌న ఆటలు సాగ‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది. కేవ‌లం ప్ర‌చారం కోసం త‌ప్ప‌, పార్టీని బ‌లోపేతం చేసేందుకు బీటెక్ ర‌వి ప‌ని చేయ‌డం లేద‌ని ఈ ఎపిసోడ్‌తో తేలిపోయింద‌ని అధికార పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఇడుపుల‌పాయ‌ను అడ్డు పెట్టుకుని బీటెక్ ర‌వి టీడీపీ అధినేత చంద్ర‌బాబు దృష్టిలో ప‌ర‌ప‌తి పెంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, ఆయ‌న అనుకున్న‌వేవీ సాగ‌లేదు.