జ‌గ‌న్ త‌న గొయ్యి తానే తవ్వుకుంటున్నారా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించి విస్తృతంగా స‌ర్వేలు చేయిస్తున్నారు. వాటి ప్రాతిప‌దిక‌నే ఎమ్మెల్యే, ఎంపీల టికెట్లు ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు నేత‌ల స‌మావేశంలో కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. అందుకే క్షేత్ర‌స్థాయిలో…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించి విస్తృతంగా స‌ర్వేలు చేయిస్తున్నారు. వాటి ప్రాతిప‌దిక‌నే ఎమ్మెల్యే, ఎంపీల టికెట్లు ఇవ్వ‌నున్నారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు నేత‌ల స‌మావేశంలో కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. అందుకే క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా తిర‌గాల‌ని, ప్ర‌జాద‌ర‌ణ ఉంటే త‌ప్ప తానేమీ చేయ‌లేన‌ని ఆయ‌న నిర్మొహ‌మాటంగా చెప్పారు. ఇంత వ‌ర‌కూ బాగా వుంది.

అయితే ఆయ‌న చేసిన త‌ప్ప‌ల్లా… స‌ర్వే బాధ్య‌త‌ల‌ను సొంత పార్టీ నేత‌ల‌కు అప్ప‌గించ‌డం. త‌న‌కు ద‌గ్గ‌రైన ఇద్ద‌రు నేత‌ల‌కు కోట్లాది రూపాయ‌లు ముట్ట‌చెప్పి మ‌రీ స‌ర్వేలు చేయించుకుంటున్నారు. సొంత పార్టీ నేత‌ల‌కు స‌ర్వే బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే, పార‌ద‌ర్శ‌క నివేదిక‌లు ఎలా వ‌స్తాయ‌నే చ‌ర్చ వైసీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది. ఏ ఇద్ద‌రు వైసీపీ నేత‌లు క‌లిసినా, ఫ‌లానా నాయ‌కులు స‌ర్వేలు చేయిస్తున్నార‌ని, అధినాయ‌కుడి మెప్పుకోసం గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న‌దానికి భిన్నంగా నివేదిక‌లు స‌మ‌ర్పిస్తున్నార‌నే విమ‌ర్శ వినిపిస్తోంది.

త‌మ‌కు గిట్ట‌ని నాయ‌కుల‌పై వ్య‌తిరేక నివేదిక‌లు ఇస్తూ, త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారి విష‌యంలో అనుకూలంగా ఉన్న‌ట్టు జ‌గ‌న్‌కు నివేదిక‌లు స‌మ‌ర్పిస్తున్నార‌నే భ‌యాందోళ‌న వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. స‌ర్వే బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న స‌ద‌రు నాయ‌కులు ఇత‌ర స‌ర్వే సంస్థ‌ల్ని కూడా ప్ర‌భావితం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇత‌ర స‌ర్వే సంస్థ‌ల నిర్వాహ‌కుల‌ను ప్ర‌లోభ పెట్టి, త‌మ‌కు అనుకూలంగా, లేదా వ్య‌తిరేకంగా నివేదిక‌లు ఇచ్చేట్టు భారీ  మొత్తంలో డ‌బ్బు ముట్ట చెప్పిన‌ట్టు అధికార పార్టీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లొస్తున్నాయి.

అస‌లే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు భ‌జ‌న చేసే వాళ్లంటే ఇష్ట‌మ‌ని, ఇప్పుడాయ‌న చుట్టూ అలాంటి వారే చేరి, రాజ‌కీయంగా చెడగొడుతున్నార‌నే అభిప్రాయం వుంది. ఈ నేప‌థ్యంలో స‌ర్వేల్ని అడ్డు పెట్టుకుని వైఎస్ జ‌గ‌న్‌తో భారీ మొత్తంలో డ‌బ్బు గుంజుతూ సొమ్ము చేసుకుంటున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధానం క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రంగా వైసీపీపై సానుకూల‌త వుంద‌ని, కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌పై వ్య‌తిరేక‌త ఉందంటూ సీఎం జ‌గ‌న్‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు స‌ర్వే పేరుతో చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

జ‌గ‌న్‌ను ఓడించ‌డానికి ప్ర‌త్య‌ర్థులెవ‌రో అవ‌స‌రం లేద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. తాను న‌మ్ముకున్నోళ్లే జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ముంచ‌నున్నార‌నే ఆందోళ‌న అధికార పార్టీ నేత‌ల్లో వుంది. నిష్ప‌క్ష‌పాతంగా స‌ర్వేలు చేసే ప్రైవేట్ సంస్థ‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి వుంటే, మంచి ఫ‌లితాలు వ‌చ్చేవంటున్నారు. సొంత పార్టీ నేత‌ల‌కే స‌ర్వే ప్రాజెక్టులు ఇవ్వ‌డం ఒక్క జ‌గ‌న్‌కే చెల్లింద‌ని వైసీపీ నేత‌లు నిష్టూర‌మాడుతున్నారు.