గత కొంత కాలంగా చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని రగిలిపోతున్నారు. తనకు వ్యతిరేకంగా తమ్ముడైన కేశినేని చిన్నిని ప్రోత్సహించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడలో తనను కాదని, సొంత సోదరుడైన చిన్నిని ఎంపీగా పోటీ చేయించేందుకు రంగం సిద్ధమైందని కేశినేని పసిగట్టారు. దీంతో టీడీపీలో తనను టార్గెట్ చేస్తూ చోటు చేసుకుంటున్న పరిణామాలపై బహిరంగంగానే అసహనాన్ని, ఆగ్రహాన్ని కేశినేని ప్రదర్శిస్తున్నారు.
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ టికెట్‌ను పిట్టలదొరకెవరికో కేటాయిస్తారని, తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలుస్తానని ప్రకటించారు. కేశినేని వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుపై కేశినేని ప్రశంసలు కురిపించడం, ఆ వెంటనే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేయడం తెలిసిందే.
కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య చాలా కాలంగా పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. కేశినేని ప్రశంసించడం వల్లే బుద్ధా వెంకన్న వైసీపీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి బుద్ధా మీడియా ముందుకొచ్చారు. కేశినేనిని ఏమీ అననంటూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ … ‘కేశినేని నాని గురించి ఎలాంటి కామెంట్స్ చేయను. ఆయన గురించి హైకమాండ్ చూసుకుంటుంది. కేశినేని నాని చంద్రబాబుని ఏమీ అనలేదు. చంద్రబాబును విమర్శిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను’ అని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. కేశినేనిని విమర్శించడానికి అవకాశం ఎదురు చూస్తున్నట్టు బుద్ధా వెంకన్న సంకేతాలు పంపారు.
అసలే కేశినేని వైఖరిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేశినేనిపై విమర్శలు చేయడం ద్వారా చంద్రబాబు దృష్టిలో మంచి మార్కులు పొందొచ్చని బుద్ధా తహతహలాడుతున్నారనే చర్చ నడుస్తోంది. కేశినేనిని పార్టీ నుంచి బయటకు పంపడానికి రోజులు దగ్గరపడ్డాయని బుద్ధా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది.