టీడీపీలో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న తూచ్‌…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పర్య‌ట‌న‌ల్లో భాగంగా కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌న్న‌వ‌రం టీడీపీ అభ్య‌ర్థిగా వైసీపీ నుంచి వెళ్లిన…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పర్య‌ట‌న‌ల్లో భాగంగా కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌న్న‌వ‌రం టీడీపీ అభ్య‌ర్థిగా వైసీపీ నుంచి వెళ్లిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ పేరును యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేశ్ ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబునాయుడి ఆదేశాల మేర‌కు యార్ల‌గ‌డ్డ పేరు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు లోకేశ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అయితే టీడీపీ టికెట్ త‌మ‌కు ఖ‌రారైంద‌ని ఎవ‌రైనా చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంటుంటే అదంతా ఉత్తుత్తిదే అని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్ప‌డం విశేషం. ఈయ‌న గారు టీడీపీ అధికారంలోకి వ‌స్తే మొద‌టి సంత‌కం మొద‌లుకుని, అభ్య‌ర్థుల‌పై కూడా మాట్లాడ్డం చ‌ర్చ‌కు దారి తీసింది. బుద్ధా కామెంట్స్‌పై టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

ప‌శ్చిమ‌గోదావరి జిల్లా న‌ర‌సాపురంలో ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విప‌క్షాల‌పై వైసీపీ ప్ర‌భుత్వం పెట్టిన అక్ర‌మ కేసుల‌న్నింటిని ఎత్తివేస్తామ‌ని, మొద‌టి సంత‌కం ఆ ఫైల్‌పైన్నే అని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.  

అలాగే రాష్ట్రంలో ఇంత వ‌ర‌కూ చంద్ర‌బాబునాయుడు ఎవ‌రికీ టికెట్లు కేటాయించ‌లేదని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ ఎవ‌రైనా త‌మ పార్టీ నాయ‌కులు తామే అభ్య‌ర్థుల‌మ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నా, అది అవాస్త‌వ‌మ‌ని బుద్ధా వెంక‌న్న బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు, లోకేశ్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు కొంద‌రున్నారు. అయినా అభ్య‌ర్థుల సంగ‌తి బుద్ధా వెంక‌న్న‌కు ఎందుక‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. బుద్ధా వెంక‌న్న త‌న స్థాయికి త‌గ్గ‌ట్టు మాట్లాడితే మంచిద‌ని ఆయ‌న పార్టీ నాయ‌కులు హిత‌వు చెబుతున్నారు.