టీడీపీ అధినేత చంద్రబాబు శుభమాని ఉత్తరాంధ్రా టూర్ కి ముహూర్తం పెట్టుకుని కాలు కదిపారు. ఆయన అలా విమానం దిగారో లేదో కానీ ఇలా వైసీపీకి చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ బాబు మీద భారీ ఆరోపణలు చేశారు. 120 కోట్ల కేబుల్ స్కాం టీడీపీ హయాంలో జరిగిందని, అందులో బాబు హస్తం కూడా ఉందని హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
ఆనాడు ఫైబర్ కేబుల్ కనెక్షన్ ఇంటింటికీ కారు చౌకగా వినోదం అంటూ టీడీపీ హడావుడి చేసిందని, అయితే అందులో కూడా కుంభకోణమే చేశారంటూ గుడివాడ విమర్శించారు. ఇక ఈ కుంభకోణంలో ఇప్పటికి ముగ్గురిని అరెస్ట్ చేశామని కూడా ఆయన చెప్పారు.
మరో వైపు చూస్తే చంద్రబాబు డబ్బు కోసం పనులు చేసే మనిషి అయితే జగన్ మాత్రం ప్రజల కోసం డబ్బులు సమకూర్చే ముఖ్యమంత్రి అని గుడివాడ మార్క్ పంచ్ పేల్చారు.
చంద్రబాబు బాదుడే బాదుడు అని నినాదాలు చేస్తున్నారని, నిజానికి ఆ ముచ్చటను 2019లో ప్రజలు తీర్చేశారని, టీడీపీని ఒక బాదుడు బాది ఓడించేసి పక్కన పెట్టారని కూడా గుడివాడ పేర్కొనడం విశేషం.
చంద్రబాబు హయాంలో ఏ రకమైన ధరలు ఉన్నాయో ఇపుడు కూడా అవే ఉన్నాయని, అయినా తన రాజకీయ ఉనికి కోసమే బాబు బాదుడు కార్యక్రమం చేపట్టారని ఆయన ఎద్దేవా చేశారు.