హీరోల గురించి మాత్రమే మాట్లాడే కాలంలో మొదటిసారి ఒక డైరెక్టర్ పేరు విన్నాను. అపుడు నేను చాలా చిన్నవాన్ని. తాతామనుమడు సినిమాని తీసిన కుర్రాడికి 30 ఏళ్లు కూడా లేవు, పేరు దాసరి నారాయణరావు. మారుమూల చిన్న టౌన్‌లో కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం ఒక వింత.
రెండేళ్లకో సినిమా తీసి ఆయాసంతో గస పోస్తూ విదేశాలకి వెకేషన్‌కి వెళ్లిపోతున్న ఇప్పటి డైరెక్టర్లతో పోలిస్తే ఆయన అలసటే తెలియని అద్భుత వ్యక్తి. 150 సినిమాలకి డైరెక్టర్ అంటే ఆయన తన కెరీర్‌లో ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించి వుంటాడో, ఎందరికి తెరమీద, తెర వెనుక లైఫ్ ఇచ్చి వుంటాడో వూహకే అందని విషయం. ఆయనే ఓ సినిమా యూనివర్సిటీ, ఒక చరిత్ర.
1984లో ఉదయం దినపత్రిక ప్రారంభిస్తారని తెలిసినప్పుడు అందరిలో ఆశ్చర్యం. ఎందుకంటే ఈనాడు ఫస్ట్ ప్లేస్ అయితే మిగతా 9 స్థానాలు ఖాళీ. కాంగ్రెస్‌ను ఎదుర్కొని ఎన్టీఆర్‌ని అధికారంలోకి తెచ్చింది. మరి ఈనాడుని తట్టుకోవాలంటే మాటలా? మాటలు కాదు చేతలే అని నిరూపించాడు దాసరి.
ఉదయం డమ్మీ పేపర్ మార్కెట్‌లో వచ్చినపుడు అందరిలో షాక్. ప్రింటింగ్ క్వాలిటీ, ప్రశ్నించి నిలదీసే గుణం, ప్రతి అక్షరంలో ధైర్యం. జర్నలిజానికి కొత్త ఊపు. ఉదయంతో ఓనమాలు దిద్దిన వాళ్లు ఎందరో! ఈ పేపర్ పెట్టడానికి రామోజీతో విభేదాలే కారణమంటారు. దాసరి తన సినిమాలో విలన్‌కి భానోజీ అని పేరు పెట్టి ఎగతాళి చేస్తే, రామోజీ ఏకంగా చతురలో “బదనిక” అని నవల రాయించారు. నవలలోని బొమ్మలన్నీ దాసరిని పోలి వుంటాయి. ఇతరుల రచనల్ని తన పేరుతో సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ కథ ఈ నవల కథాంశం.
2 లక్షల సర్క్యు లేషన్ దాటినప్పుడు అందరికీ అర్థమైంది ఏమంటే ఈనాడు అభేద్యం కాదు. గట్టిగా తగిలితే కంచుకోట పగులుతుందని. కారణాలు ఏమైతేనేం ఉదయం ఎక్కువ కాలం నడవలేదు. అయితే తెలుగు జర్నలిజంలో చెరపలేని ముద్ర.
ఎన్టీఆర్‌ని దాసరి వ్యతిరేకించాడు. ఏఎన్ఆర్‌తో కలిసి పార్టీ పెడతాడని ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి అయ్యాడు. గిన్నీస్ బుక్ దర్శకుడు, పత్రికాధిపతి, కేంద్రమంత్రి ఇన్ని ఒక మనిషి జీవితంలో జరగడం అసాధ్యం. కానీ దాసరి అసాధ్యుడు.
సినీ ప్రపంచంలో తన కాలం హీరోలందరితో సినిమాలు తీశాడు. కొత్త వాళ్లని ఎందరిని పరిచయం చేశాడో లెక్కలేదు. సక్సెస్ , ఫెయిల్యూర్ పట్టించుకోలేదు. పని చేస్తూ వెళ్లాడు.
అన్నిటికీ మించి పరిశ్రమకి పెద్ద దిక్కుగా నిలిచాడు. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి డబ్బులు ఎగ్గొట్టే కల్చర్ ఉన్న పరిశ్రమలో కష్టజీవుల పక్షానా నిలిచాడు. కష్టమొస్తే మన దాసరి సార్ ఉన్నాడు కదా అనే భరోసా ఇచ్చాడు.
కొందరు చనిపోతారు. కానీ బతికే వుంటారు. (మే 4 దాసరి జయంతి)
జీఆర్ మహర్షి