తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సినిమా డైరెక్టర్ కు తక్కువ, ఈవెంట్ మేనేజర్ కు ఎక్కువ అనే తరహాలో వ్యవహరించడం కొత్త కాదు. చంద్రబాబు కు ఉన్న పబ్లిసిటీ దాహం అంతా ఇంతా కాదు. దశాబ్దాలుగా ఈ విషయంలో ఆయన తీరు పరాకాష్టకు చేరింది. గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనతోనే చంద్రబాబు పబ్లిసిటీ వ్యవహారం తీవ్ర విమర్శల పాలైంది. డ్రోన్ కెమెరాలతో జనాలను ఎగబడినట్టుగా చిత్రీకరించి పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేసి తాము తీవ్రఘాతుకానికే పాల్పడినా.. చంద్రబాబులో కానీ, ఆయన ఈవెంట్ మేనేజ్ మెంట్ టీమ్ లో కానీ కించిత్ పశ్చాతాపం లేదు.
అందుకు నిదర్శనమే మళ్లీ అలాంటి ఘటన. ఇరుకు సందుల్లోకి వెళ్లి అక్కడకు జనాలను సమీకరించి వీడియోలు తీసి.. జనాలు చంద్రబాబు కోసం ఎగబడుతున్నారనే భ్రమను కల్పించే ప్రయత్నం దారుణంగా వికటించింది. ఈ పబ్లిసిటీ దాహానికి మరో ఎనిమిది మంది బలయ్యారు. అయితే పచ్చమూకలు ఈ ఘాతుకాన్ని కూడా తమకు అనువైన రీతిలో వాడుకోవడానికి నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వాళ్లకు పరిహారం ఇస్తున్నట్టుగా, చంద్రబాబు అంటే విపరీతమైన క్రేజ్ తోనే ఇలాంటి ఘటన జరిగినట్టుగా చిత్రీకరించడానికి నిర్మొహమాటంగా పచ్చమూకలు ప్రయత్నాలు మొదలయ్యాయి ఇప్పటికే.
వీరి తీరును గమనిస్తే.. ఇలాంటి దుర్ఘటనలకు కాస్తైన మారే వారైతే.. గోదావరి పుష్కరాలతోనే మారేవారని, అయితే అలాంటి పశ్చాతాపాలు ఏ కోశానా లేవని మరోసారి తేటతెల్లం అవుతోంది. అయితే చంద్రబాబు పబ్లిసిటీ పరితాపానికి ఇలా ఇంకా ఎంతమంది బలవ్వాలి? అనేది అసలైన ప్రశ్న.
గోదావరి పుష్కర దుర్ఘటన, మళ్లీ ఇంకోటి. అయితే వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తారు. అందులోనూ పచ్చమంద కొన్నాళ్లుగా చంద్రబాబుకు జనాలు ఎగబడుతున్నారనే గోబెల్స్ ప్రచారాన్ని అందుకుంది. ఆ ప్రచారం కోసం ఇరుకుసందుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. జరగరానిదే జరిగింది. అయినా ఈ మంద తీరు మారదు. చంద్రబాబు పబ్లిసిటీ దాహం తీరదు. ఇందుకోసం ఇంకెంతమందిని అయినా బలిపెట్టగలరు. చంద్రబాబు సభలకు వెళ్లేవారు, వెళ్లాలనుకునే వారే ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి!