చిరంజీవి.. టాలీవుడ్ లో ఓ బ్రాండ్. చిరు ఓ మాట చెబితే అది జరిగి తీరుతుంది. అయితే ఇది ఒకప్పుడు. మరీ ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి చిరంజీవి చెప్పినవేవీ జరగడం లేదు. “అన్నయ్య లీకులివ్వడానికే తప్ప హైప్ ఇవ్వడానికి పనికిరాడు” అనే మాట స్వయంగా ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
చిరంజీవిపై ఎందుకు మెగాభిమానులు ఇంత కస్సుబుస్సులాడుతున్నారు. చిరంజీవిని నమ్మేది లేదంటూ ఎందుకు 2 రోజులుగా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం చిరంజీవి గతంలో చేసిన ప్రకటనలు, ఆ సినిమాల ఫలితాలు.
సాధారణంగా హీరోలు తమ సినిమాపై హైప్ పెంచేలా మాట్లాడతారు. కానీ చిరంజీవి మాత్రం తను చెప్పిందే నిజం అన్నట్టు మాట్లాడతారు. తను చెప్పింది రేపు ఉదయం జరిగి తీరుతుంది చూస్కోండి అన్నట్టుంటాయి చిరంజీవి వ్యాఖ్యానాలు. సరిగ్గా ఇక్కడే ఆయనపై ఫ్యాన్స్ కస్సుమంటున్నారు.
మొన్నటికిమొన్న ఆచార్య సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. బాహుబలి-2ను క్రాస్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదనే అర్థం వచ్చేలా చిరు కామెంట్ చేశారు. గాడ్ ఫాదర్ టైమ్ లో కూడా చిరు దాదాపు ఇలాంటి స్టేట్ మెంట్సే ఇచ్చారు. తన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు. ఇంకాస్త వెనక్కు వెళ్తే సైరా గురించి చిరంజీవి అన్న మాటలు కూడా గుర్తొస్తాయి.
అయితే చిరంజీవి ఇచ్చే స్టేట్ మెంట్స్ కు రిలీజ్ తర్వాత ఆ సినిమా చూపిస్తున్న ఫలితానికి ఎలాంటి పొంతన ఉండడం లేదు. కొన్ని సినిమాలుగా ఇదే నడుస్తోంది. దీంతో వాల్తేరు వీరయ్యపై చిరంజీవి ఇచ్చే హైప్ చూసి ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. “ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, అందుకుంటాం” అంటూ చిరు చెబుతుంటే అభిమానులు లైట్ తీసుకుంటున్నారు. పైపెచ్చు దీనికి కౌంటర్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
కనీసం ఈసారైనా చిరంజీవి కామెంట్స్ నిజమవ్వాలని కోరుకుందాం.. వాల్తేరు వీరయ్య పెద్ద సక్సెస్ అయి మెగాభిమానులకు అసలైన పండగ తీసుకురావాలని ఆశిద్దాం..