సమ్మర్ కోసం వింటర్ నుంచే పోటీ

సాధారణంగా సంక్రాంతి తర్వాత సమ్మర్ సినిమాల హడావుడి మొదలవుతుంది. జనవరి చివరి వారం వరకు సంక్రాంతి సినిమాల సందడి ఉంటుంది. ఫిబ్రవరిలో రావాల్సిన సినిమాలు వచ్చేస్తాయి. ఆ టైమ్ లో ఏప్రిల్, మే నెలల…

సాధారణంగా సంక్రాంతి తర్వాత సమ్మర్ సినిమాల హడావుడి మొదలవుతుంది. జనవరి చివరి వారం వరకు సంక్రాంతి సినిమాల సందడి ఉంటుంది. ఫిబ్రవరిలో రావాల్సిన సినిమాలు వచ్చేస్తాయి. ఆ టైమ్ లో ఏప్రిల్, మే నెలల సినిమాల విడుదలపై ప్రకటనలు వరుసపెట్టి వస్తుంటాయి.

కానీ ప్రస్తుతం టాలీవుడ్ అన్ని విషయాల్లో తొందరపడుతోంది. ఇందులో భాగంగా సమ్మర్ సినిమాలపై కూడా అదే అత్యుత్సాహం చూపిస్తోంది. ఇప్పట్నుంచే చాలా నిర్మాణ సంస్థలు తమ సినిమాల విడుదల తేదీల్ని సమ్మర్ టార్గెట్ గా ప్రకటిస్తున్నాయి. అలా వింటర్ నుంచే కర్చీఫ్ లు వేస్తున్నాయి.

ఓ విషయం గమనించారా.. ఏప్రిల్ లో రిలీజ్ డేట్స్ అన్నీ ఎప్పుడో నిండిపోయాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రావణాసుర సినిమా వస్తోంది. ఈ తేదీని దాదాపు నెల కిందటే ప్రకటించారు. రెండో వారంలో భోళాశంకర్, రుద్రుడు సినిమాలొస్తున్నాయి. ఈ తేదీల్ని 2 నెలల కిందటే ప్రకటించారు. ఇక మూడో వారంలో విరూపాక్ష వస్తోంది. నాలుగో వారానికి మణిరత్నం తీస్తున్న పొన్నియన్ సెల్వన్-2ను తాజాగా ప్రకటించారు.

ఇలా ఏప్రిల్ నెల బాక్సాఫీస్ కర్చీఫులతో నిండిపోయింది. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా కూడా ఏప్రిల్ నెలలోకే వచ్చి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక్కడితో ఇది పూర్తవ్వలేదు. ఇప్పుడు మేకర్స్ అంతా మే నెలపై పడ్డారు. తమ సినిమాల విడుదల తేదీల్ని ఇలా 5 నెలల ముందు నుంచి ప్రకటించడం మొదలుపెట్టారు. మే నెలలో నాగచైతన్య నటిస్తున్న కస్టడీ సినిమాను విడుదల చేస్తున్నారు. జనవరి 1కి, సంక్రాంతికి మరికొన్ని సినిమాలు మే రిలీజ్ డేట్స్ ను ప్రకటించబోతున్నాయి. ఇలా వింటర్ లోనే సమ్మర్ రిలీజుల వేడి రాజుకుంది.