రెండేళ్ల నుంచి నూతన సంవత్సరం వేడుకలు చప్పగా సాగుతున్నాయి. దీనికి కారణం కరోనా. అందుకే ఈ ఏడాది తగ్గేదేలే అంటున్నారు కుర్రకారు. ఓవైపు కరోనా భయాలు కమ్ముకుంటున్నప్పటికీ, 31రాత్రి జరగనున్న పార్టీలపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.
న్యూ ఇయర్ పార్టీల కోసం హైదరాబాద్ లో జోరుగా టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. గడిచిన రెండేళ్లతో పోల్చుకుంటే, ఈ ఏడాది 50శాతం ఈవెంట్లు పెరిగాయి. టికెట్ అమ్మకాలు కూడా అదే రేంజ్ లో సాగుతున్నాయి. ఈ సారి 31 రాత్రి హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిథిలో నగరం నలుమూలల దాదాపు 120 ఈవెంట్లు జరగనున్నాయి.
సిటీలోని కీలకమైన పబ్స్ అన్నింటిలో ఇప్పటికే బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. స్టార్ హోటల్స్ లో ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. కాస్త డబ్బు పెట్టగలిగే కుర్రాళ్లంతా బల్క్ బుకింగ్స్ చేసుకున్నారు.
ఇక రిసార్ట్స్ సంగతి సరేసరి. డిసెంబర్ మొదటివారంలోనే అన్ని బుకింగ్స్ అయిపోయాయంటూ రిసార్ట్స్ మేనేజ్ మెంట్స్ ప్రకటించాయి. కొన్ని రిసార్టుల్ని 2-3 భాగాలుగా చేసి మరీ ఈవెంట్లకు అద్దెలకు ఇచ్చేశారు.
కేవలం డబ్బులు ఖర్చు పెట్టే కుర్రాళ్లు మాత్రమే కాదు, మధ్యతరగతి యువతి కూడా ఈ ఏడాది గట్టిగా పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయింది. రెండేళ్ల నుంచి న్యూఇయర్ పార్టీలకు దూరమవ్వడంతో ఈసారి 31 రాత్రి బ్యాండ్ బజాయించాల్సిందే అంటున్నారు చాలామంది.
పోలీసులు Vs నిర్వహకులు
ఓవైపు యువతలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, మరోవైపు పోలీసులు వెర్సెస్ ఈవెంట్ మేనేజ్ మెంట్ల పోరు నడుస్తోంది. 31 రాత్రి ఎలా నడుచుకోవాలి, ఆంక్షలు ఏంటనే అంశంపై ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీచేశారు. పబ్ నిర్వహకులు, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు వీటిపై పెదవి విరుస్తున్నాయి.
పర్మిషన్లకు దరఖాస్తు పెట్టుకుంటే అనుమతి ఇవ్వని పోలీసులు, మార్గదర్శకాల జారీకి మాత్రం ముందుంటారని కామెంట్ చేస్తున్నారు. పొలిటికల్ సిఫార్సులతో వచ్చే వాళ్లకు అనుమతులిస్తూ, నిజాయితీగా అప్లయ్ చేసుకున్న కంపెనీలకు అనుమతులు ఇవ్వకుండా నాన్చుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.
వీళ్ల గొడవ ఎప్పుడూ ఉండేదే. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ టైమ్ కు గేట్లు తెరిచేస్తారనేది బహిరంగ రహస్యం. మొత్తమ్మీద ఈ ఏడాది 31 రాత్రికి పార్టీలు దద్దరిల్లే రేంజ్ లో ఉండబోతున్నాయనేది మాత్రం గ్యారెంటీ.