విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎవరికైనా చంద్రబాబు ఠక్కున గుర్తుకు వస్తారు. ఆయన ప్రచార ప్రభావం అలాంటిది మరి. 1999లో బాబు రెండవసారి ఉమ్మడి ఏపీకి సీఎం అయిన తరువాత విజన్ 2020 అంటూ వచ్చారు. దాని వెనక ఉన్న లక్ష్యాలు ఏమైనా అసలు టార్గెట్ 2020 దాకా బాబు అధికారంలో ఉండాలన్నది అంటూ నాడే ప్రత్యర్ధి పక్షాలు విమర్శించారు.
తీరా చూస్తే 2020 నాటికి బాబు విపక్షంలో ఉన్నారు. అది కూడా ఉమ్మడి ఏపీ రెండుగా మారితే పదమూడు జిల్లాల ఏపీకి ప్రతిపక్షం అన్న మాట. 2024 ఎన్నికలు తరుముకువస్తున్న వేళ చంద్రబాబు 2047 అంటున్నారు. బీజేపీ కూడా 2047 దాకా అంటోంది. అమృత కాలం అని చెబుతోంది.
అప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తి అవుతాయని బీజేపీ అమృత కాలంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని అంటోంది. చంద్రబాబు సైతం 2047 అంటున్నారు. మరో పాతికేళ్ళలో దేశం రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఒక విజన్ డాక్యుమెంట్ ని బాబు రూపొందించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఆ విజన్ డాక్యుమెంట్ ని చంద్రబాబు విశాఖలో మేధావులు విద్యావంతుల ముందు విడుదల చేస్తారని చెబుతున్నారు. విజన్ 2047 అంటే అప్పటిదాకా ఏపీలో అధికారం ఇవ్వమని టీడీపీ అడగడమే అసలు విజన్ అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. విజనరీ బాబు దేశం కోసం పాటుపడుతూ కొత్త విజన్‌ని చూపిస్తున్నారు అని తమ్ముళ్ళు వాదిస్తున్నారు. తినబోతూ రుచి ఎందుకు అన్నట్లుగా చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఏంటి అన్నది ఆగస్ట్ 15 వేళ విశాఖలో చూడవచ్చు అంటున్నారు.