చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి ఇచ్చారు. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. ఇంత వరకూ ఈ పదవిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగుతున్నారు. అంటే చెవిరెడ్డి పదవిని ఆయన కుమారుడికి ఇచ్చినట్టైంది.
రెండో దఫా కేబినెట్ విస్తరణ సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి తుడా చైర్మన్ పదవిని సీఎం రెన్యువల్ చేసిన సంగతి తెలిసిందే. తుడా నిధులతో చంద్రగిరి నియోజకవర్గమంతా ఊరూరా సిమెంట్ రోడ్లు వేయించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో తన కుమారుడికి చంద్రగిరి టికెట్‌కు సీఎంతో ఆమోద ముద్ర వేయించుకున్నారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
మరోవైపు ఎన్నికల ముంగిట జగన్ ఇచ్చే పొలిటికల్ అసైన్‌మెంట్స్‌ను చక్కదిద్దేందుకు చెవిరెడ్డి విజయవాడలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా తుడా చైర్మన్ పదవి ఇప్పించుకోవడంలో మతలబు ఏంటనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తుడా చైర్మన్‌గా ఒన్ అండ్ ఓన్లీ లీడర్‌గా చెవిరెడ్డి హవా కొనసాగిస్తున్నారు.
గతంలో భూమన కరుణాకరరెడ్డి కూడా ఇలాగే బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ హయాంలో తుడా చైర్మన్‌తో పాటు డైరెక్టర్లకు కూడా స్థానం కల్పించారు. తుడా చైర్మన్‌గా చిన్న వయసులో పదవి దక్కించుకోనున్న మోహిత్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌కు బలమైన పునాదులు వేసుకుంటారని ఆశిద్దాం.
ప్రొటోకాల్ సమస్య ఉత్పన్నం కాకుండా…
తనయుడికి తుడా చైర్మన్ పదవి ఇప్పించుకోవడంపై “గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి”తో చెవిరెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం తన కుమారుడు తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్నారన్నారు. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంట వెళ్లడంపై కలెక్టర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు.
ఏ ప్రొటోకాల్ ప్రాతిపదికన అధికారులు మోహిత్‌రెడ్డి వెంట వెళుతున్నారనే ప్రశ్న ఉత్పన్నం కావడంతో తన పదవిని కుమారుడికి ఇప్పించుకున్నట్టు వివరించారు. దీంతో ఇటు అధికారులు, అటు మోహిత్‌రెడ్డి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల్లో స్వేచ్ఛగా తిరగ్గలుగుతారని ఆయన వివరించారు.
పీ.ఝాన్సీ