ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వడంతో ఆయనను నిన్న రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు జైలులో ప్రతేక్య ఏర్పాట్లు చేశారు. జైల్లోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని కేటాయించారు. అలాగే ఆయనకు ఖైదీ నెంబర్ 7691 కేటాయించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు సంబంధిత అధికారులకు ఆదేశించింది. అలాగే నేటి నుండి చంద్రబాబుకు ఇంటి ఫుడ్‌ను అందించనున్నారు. మరోవైపు టీడీపీకి ఆగస్టు సంక్షోభం పోయి 23 సంక్షోభం వెంటడుతోంది. చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691(7+6+9+1= 23) అంకెలను కలిపితే కూడా 23నే రావడంతో చంద్రబాబును 23 సంక్షోభం వదలడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుపొందారు. విశేషమేంటంటే ఎన్నికల ఫలితాలను కూడా మే 23న ప్రకటించటంతో అప్పటి నుండి టీడీపీకి 23 సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈ నెల 22 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.