టైమ్ చూసి పంచ్ లేయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఆయన టైమింగ్ మరొకరికి రాదు. పవన్ కల్యాణ్ పై పంచ్ లు వేయడం వర్మకు కొత్త కాదు. ఆ మాటకొస్తే, పవన్ పై ఆయన ఏకంగా ఓ సినిమానే తీసి వదిలాడు. ఇప్పుడు మరోసారి పవన్ కల్యాణ్ పై తనదైన స్టయిల్ లో పంచ్ లేశాడు ఆర్జీవీ.
చంద్రబాబు అరెస్ట్ తో పవన్ కల్యాణ్ రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. పోలీసులు నిలువరిస్తే, రోడ్డుపైనే పడుకున్నాడు పవన్. ఆ తర్వాత రోడ్డుపైనే కూర్చొని, పోలీసులతో వాగ్వానికి దిగారు. ఈ అంశంపై వర్మ ట్వీట్ చేశాడు.
పవన్ మెంటాలిటీని తనకంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేరంటూ ట్వీట్ వేసిన ఆర్జీవీ, ప్రస్తుతం తను తీస్తున్న వ్యూహం సినిమాలో పవన్ పాత్రధారికి చెందిన ఫొటోల్ని పోస్ట్ చేశారు.
నెల రోజుల కిందట పవన్ పాత్రధారిపై తను ఎలాంటి పోజుల్ని చిత్రీకరించానో, సరిగ్గా అలాంటి పోజుల్నే పవన్ కల్యాణ్, తన నిజజీవితంలో ఇచ్చారని చెప్పుకొచ్చాడు వర్మ. ఈ సందర్భంగా వ్యూహం సినిమాలో తను తీసిన స్టిల్స్ ను, రియల్ లైఫ్ లో పవన్ కల్యాణ్ పై తీసిన ఫొటోల్ని ఆయన సరిపోల్చాడు.
వర్మ చెప్పినట్టు, నిజంగానే వ్యూహం సినిమాలో స్టిల్స్ లానే పవన్ కల్యాణ్ రెస్పాండ్ అయ్యారు. వ్యూహం సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ, ఆ సినిమాలో పవన్ మేనరిజమ్స్ మాత్రం, తాజా పవన్ వ్యవహారశైలికి అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి.
ఈ సందర్భంగా చంద్రబాబుపై కూడా వర్మ పంచ్ లేశాడు. వివాహం అనే జైలు జీవితం నుంచి నిజమైన జైలుకి చంద్రబాబు వెళ్లారని, అది కూడా తన పెళ్లి రోజు నాడు ఇలా జరగడం విశేషమని స్పందించారు. దీన్నే విధిరాత లేదా కర్మ సిద్దాంతం అంటారంటూ ట్వీట్ వేశాడు.