తిరుపతి – తిరుమల వేర్వేరు కాదు.తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ కావడంతో తిరుపతి అభివృద్ధిలో ఆ ఆధ్యాత్మిక సంస్థ భాగస్వామ్యం అవుతుందని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. అదే సమయంలో టీటీడీ నిధులను ధర్మప్రచారానికే వినియోగించాలనే వాదన కొందరు తెరపైకి తెస్తున్నారు.
అభివృద్ధి అంటే నిధులు ఖర్చు చేయడమే కాదు.
తిరుపతి అభివృద్ధిలో టీటీడీని భాగస్వామ్యం చేయడం అంటే ఏంటి? టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయడం మాత్రమే అన్న దురభిప్రాయం చేలా మందిలో సహజంగానే ఉన్నది. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా తిరుపతి అభివృద్ధిలో టీటీడీని భాగస్వామ్యం చేయవచ్చు. ఉదాహరణకు ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ సారధ్యంలో నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించే (అంటే తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు) వారికి బస్సు టికెట్లోనే శ్రీవారి దర్శనం, తిరుపతిలో హోటల్ సదుపాయం కల్పించే ప్యాకేజి అమలు చేయడం వల్ల తిరుపతి పర్యటన సంస్థ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. భక్తులకు సౌకర్యం అవినీతి రహిత వాతావరణం నెలకొంది. ఇందులో టీటీడీ నుంచి రూపాయి ఖర్చు చేయలేదు. అంటే దూరదృష్టితో ఆలోచన చేస్తే టీటీడీ సహజసిద్ధ అవకాశాలను వినియోగిస్తే తిరుపతి సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది.
తిరుపతి, తిరుమలను వేర్వేరుగా చూడడమా?
టీటీడీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ. ఆదాయంలో కూడా. దాదాపు 1200 సంవత్సరాల లిఖిత పూర్వక చరిత్రను, తిరుమలను కళ్ళలో పెట్టుకుని చూసుకుంది తిరుపతి సమాజం. 100 సంవత్సరాల క్రితం టీటీడీకి ఇంత పెద్ద ఆదాయం ఉండేది కాదు. కానీ తిరుమల శ్రీవారి ఆలయం ఆలనా పాలన చూసుకుంది తిరుపతి ప్రజలే. దాదాపు 1100 సంవత్సరాలు తిరుమలను అభివృద్ధి చేసింది తిరుపతి ప్రజలు.
నేడు అతిపెద్ద ఆదాయ వనరులు కలిగి ఉన్న దేవాలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం రూపాంతరం చెందింది. 1100 సంవత్సరాలు వరకు తిరుమలను ప్రపంచం పట్టించుకోలేదు. గత వంద సంవత్సరాలుగా తిరుమలను ప్రపంచం పట్టించుకుంటోంది. ఈ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు తిరుపతి – తిరుమల వేర్వేరు కాదు అని. టీటీడీ మ్యాన్యుల్ పరిశీలిస్తే నీటి వనరుల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయాలని ఉంది. అంటే చాలా కాలం తిరుపతి పరిసరాల్లో ఉన్న చెరువుల కింద వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులతో తిరుమలలో రోజూ వారీ కార్యక్రమాలు నిర్వహించేవారు.
నేటి పరిస్థితులు..
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నేడు సగటున ఒక లక్షల మంది వస్తున్నారు. వారి తిరుమల ప్రయాణం తిరుపతి నుంచే జరుగుతుంది. ఫలితంగా తిరుపతి రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. తిరుపతి ప్రజలు రోజుకు ఎంత మంది తమ నగరంలో తిరుగుతారో, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు అంతే మంది పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో తిరుపతిలో అభివృద్ధి , సౌకర్యాల కల్పన జరిగితే తిరుపతి ప్రజలకు ఎంత సౌకర్యం ఉంటుందో… ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అంతే సౌకర్యం కలుగుతుంది.
తిరుపతి అభివృద్ధిలో టీటీడీని భాగస్వామ్యం చేయాలనే సహజ సిద్ధమైన అభిప్రాయం చాలా కాలం నుంచి వ్యక్తమవుతోంది. టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఇతర ప్రాంతాల వారు ఉండటం వల్ల ఆచరణ సాధ్యం కాలేదు. అప్పటికప్పుడు ఏర్పడే అవసరాల ప్రాతిపదికన జరిగే పనులు టీటీడీ తిరుపతిలో చేస్తుంది. శ్రీవారి భక్తులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి నగరాన్ని విస్తరించి ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోజూ వారీ అవసరాల నిమిత్తం జరుగుతున్న పనులతో తిరుపతి అభివృద్ధి చెందుతుంది.
అదే దూరదృష్టితో ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తే దేశంలోనే మంచి నగరంగా తిరుపతి అభివృద్ధి చెందుతుంది. అది తిరుపతి ,శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉపయోగంగా ఉంటుంది. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన నేపథ్యంలో ఆ నగర అభివృద్ధిలో ఆధ్యాత్మిక సంస్థను భాగస్వామ్యం చేయడం కోసం సమగ్రమైన ఆలోచన చేయాలి. ఆ మేరకు ప్రయత్నం జరగాలి. అందుకోసం భూమన బాధ్యత తీసుకోవాలి. వారు చేసే బాధ్యతయుత ప్రయత్నాల్లో తిరుపతి ప్రజలు భాగస్వామ్యం కావాలి.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం, తిరుపతి