“ఆహా”…అహ్హహ్హ అని నవ్వుకోకుండా వుండలేరు. చంద్రబాబు కన్నీళ్లకు ఆయనపై మచ్చ చెదిరిపోదు. 1995లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను సీఎం గద్దె నుంచి కూలదోయడంపై చంద్రబాబు వ్యూహాత్మక సమాధానం ఇచ్చారు. కుట్రలో ‘అన్‌స్టాపబుల్’ టాక్‌షో హోస్ట్, బామ్మర్ది బాలయ్యను కూడా చంద్రబాబు కలుపుకోవడం గమనార్హం. మామ గురించి చెబుతూ చంద్రబాబు భావోద్వేగానికి లోను కావడం టాక్ షోలో హైలెట్‌గా నిలిచింది.
ఆహా ఓటీటీ వేదికపై బాలయ్య హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సీజన్-2 త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రొమో విడుదలైంది. బావ చంద్రబాబును బాలయ్య ఓ ప్రశ్న అడిగారు. మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం ఏదీ? అని ప్రశ్నించగా… చంద్ర బాబు ఆహభావాలు వెంటనే మారిపోయాయి. బాబు లోని నటనను బాలయ్య బయటికి తీసాడు. అంతా నాటకీయంగా సాగింది. 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దింపడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన మాట వినాలని కాళ్లు పట్టుకుని అడుక్కున్నానని, కానీ ఎన్టీఆర్ వినలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో కుట్రలో బాలయ్యకు భాగస్వామ్యం ఉందని లోకానికి మరోసారి చాటి చెప్పేందుకు బామ్మర్దికి బాబు ఓ ప్రశ్న వేశారు. ‘ఒక వ్యక్తిగా అడుగుతున్నాను. మనం తీసుకున్న నిర్ణయం తప్పా’ అని చంద్రబాబు ప్రశ్నించడం గమనార్హం. 1995 వెన్నుపోటు ఘటనను మళ్లీ తెరపైకి తేవడం చూస్తే… తన తండ్రి తప్పుడు పనులు చేశారని, బావ చంద్రబాబుది ఏ తప్పూ లేదనే సందేశాన్ని సమాజానికి పంపేందుకే బాలయ్య ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
1995 ఎపిసోడ్‌లో తప్పు చంద్రబాబుదా? ఎన్టీఆర్‌దా? అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. బాలయ్య, చంద్రబాబు కలిసి టాక్‌షోలో చెప్పినట్టు ఎన్టీఆర్‌దే తప్పు. చంద్రబాబు చేసిన పని సరైందని చెప్పడానికి కన్న తండ్రిని బలి పెట్టడానికి బాలయ్య వెనుకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చంద్రబాబుపై వెన్నుపోటు మచ్చ తొలగించేందుకు కన్న తండ్రిని తప్పుడు మనిషి అని చెప్పడానికి బాలయ్య టాక్‌షోను వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్‌పై అన్‌స్టాపబుల్ కుట్రలు సాగుతూనే వున్నాయనే సెటైర్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మొత్తానికి టాక్‌షోలో ఎన్టీఆర్‌ను తప్పు పట్టేలా బాలయ్య, బాబు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.