ఇద్దరు సీనియర్ హీరోలు. ఇద్దరికీ సంక్రాంతి నే కావాలి. ఎలా? ఇదే బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సమస్యగా వినిపిస్తోంది. బాలయ్య ఈసారి సంక్రాంతికి తన సినిమా రావాలనుకుంటున్నారు. మెగాస్టార్ సంగతి తెలిసిందే. పండగ లేకుండా ఆయన సినిమా విడుదల చేయాలనుకోవడం లేదు. ఇప్పటికే జనవరి 12న వాల్తేర్ వీరయ్య సినిమా విడుదల అని డిసైడ్ చేసి, బయ్యర్లకు థియేటర్లు అగ్రిమెంట్ చేసుకోమని చెప్పేసారు. బాలకృష్ణ సినిమా డిసెంబర్ మూడో వారంలో అని ఫిక్స్ అయిపోయారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. బాలయ్య కూడా సంక్రాంతికే తన సినిమా వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలన్నది మైత్రీ సమస్య. బాలయ్యకు నచ్చ చెప్పే ప్రయత్నం జరుగుతోంది. కానీ బాలయ్య ఒక వారంలో ఏ సంగతీ చెబుతా అన్నారు. దాంతో ఇంకా సస్పెన్స్ లోనే వుంది.
ఇదిలా వుంటే రెండు సినిమాలు కూడా సంక్రాంతి లోపు రెడీ కావడం అన్నది కూడా కష్టం అని తెలుస్తోంది. బాలయ్య సినిమాకు ఇంకా కనీసం 30 రోజుల పని వుందని తెలుస్తోంది. ఇందులో టాకీ వుంది. ఒక పాట కూడా వుంది. నవంబర్ నెలాఖరు కు కానీ వర్క్ పూర్తి కాదని లేటెస్ట్ సమాచారం. డిసెంబర్ లో విడుదల కావాలంటే రాత్రి పగళ్లు పని చేయాల్సి వుంటుంది.
మెగాస్టార్ సినిమాకు కూడా వర్క్ బాగానే వుంది. ముఖ్యంగా శృతిహాసన్ డేట్ లు కావాలి. ప్రస్తుతం ఆమె బాలయ్య సినిమా షూట్ లో వుంది. దాని తరువాత నే మెగాస్టార్ సినిమా మీదకు వచ్చేది. అందువల్ల ఆ సినిమా వర్క్ కూడా టెన్షన్ తో జరగాల్సి వుంది. అందువల్ల రెండు సినిమాల్లో ఏది డిసెంబర్ లో రావాలన్నా కిందా మీదా పడాల్సి వుంటుంది.
ఇదిలా వుంటే సంక్రాంతికే వారం రోజుల్లో గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల చేస్తే ఎలా వుంటుందో అన్న ఆలోచనలు కూడా సాగుతున్నాయని తెలుస్తోంది. అలా చేయాలంటే జనవరి ఫస్ట్ వీక్ లో ఒకటి 12న మరొకటి వేయాల్సి వుంటుంది. అలా ఫస్ట్ వీక్ లో వేయడానికి బాలయ్య ఒకె అంటారా? లేక డిసెంబర్ మూడో వారానికి అంగీకరిస్తారా? అన్నది తేలాల్సి వుంది.