చంద్రబాబునాయుడు ఉసిగొల్పుతూ ఉంటే.. రాష్ట్రంలో పేదలకు మంచిరోజులు రాకుండా అడ్డుపడుతూ ఉండే పచ్చ సైంధవులు.. దేనినీ వదిలిపెట్టడం లేదు.
అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి జగన్ సర్కారు పూనిక వహిస్తే.. కొందరు కుట్రదారులు కోర్టు కేసుల రూపంలో మోకాలడ్డుతున్నారు. అసలు ఈ ప్రాంతంలో ఇళ్లపట్టాలు ఇవ్వడానికే వీలు కాదంటూ కోర్టుకేసులతో అడ్డుపుల్లలు వేసిన సంగతి తెలిసిందే.
అయితే.. అమరావతి ప్రాంతం అనేది కొన్ని కులాల, సంపన్న వర్గాల గుత్త సొత్తు కాదు అనే గట్టిగా నమ్మిన జగన్ సర్కారు అక్కడ పట్టాల పంపిణీపై సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకుంది.
నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి కూడా పూనుకుంది. కేంద్ర నిధులకు లేఖలు రాసి ఫాలో అప్ లు చేసి వారి మంజూరు సాధించింది. దాదాపు 48 వేల ఇళ్ల నిర్మాణానికి అక్కడ కేంద్రం అనుమతులు లభించాయి.
నేడో రేపో అక్కడ భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని అందరూ అనుకుంటున్న వేళ.. పచ్చ సైంధవులు మళ్లీ అడ్డుపడ్డారు. అసలు ఆర్ 5 జోన్ ఏర్పాటునే తప్పుపడుతూ.. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలను ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
కోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. గతంలో ఆర్ 5 జోన్ ఏర్పాటు వ్యవహారం కూడా కోర్టుకు వెళ్లినప్పుడు ప్రభుత్వం సుప్రీంకు వెళ్లి మరీ అనుమతులు తెచ్చుకుని పేదలకు ఇళ్లస్థలాలు పంపినీ చేసింది. చంద్రబాబునాయుడు పాచిక పారలేదు. ఇప్పుడు ఏకంగా ఇళ్లు కూడా నిర్మించేస్తుండే సరికి.. చంద్రబాబునాయుడు కంగారు పడుతున్నారు.
జగన్ సర్కారు అమరావతి ప్రాంతంలో ఏకంగా 50 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తే గనుక.. తాను రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో కూడా తన పార్టీ గెలవడం అసాధ్యం అనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే.. ఇతరులను ఉసిగొల్పి హైకోర్టులో పిటిషన్లు వేయించారనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
సుప్రీం కోర్టు తన తీర్పులో ఇళ్ల స్థలాల పంపిణీకి మాత్రమే అనుమతించిందా? ఇళ్లు నిర్మాణానికి కూడా అనుమతించిందా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఇప్పుడు అడుగుతోంది. దీని పర్యవసానంగా.. ఇళ్ల నిర్మాణం ప్రస్తుతానికి ఆగిపోయే ప్రమాదం పుష్కలంగా ఉంది. అందుకే.. పచ్చ సైంధవులు.. అమరావతిలో పేదలకు ఇళ్లు దక్కకుండా కూడా అడ్డుపడుతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.