గంభీరమైన పదాల వెనక అర్ధాలు వెతకడం బహు కష్టం. అవి బ్రహ్మ పదార్ధం అని సరిపెట్టుకోవడం ఉత్తమం. చంద్రబాబు 2024 ఎన్నికలకు తన మ్యానిఫేస్టోలో ఎన్నో ఉచితాలను రెడీ చేస్తున్నారు. వీటికి సరిసాటి అన్నట్లుగా ఏడాది క్రితం రాజమండ్రి మహానాడులో ప్రకటించిన పూర్ టు రిచ్ హామీ ఉంది.
ఇంతకీ పూర్ టు రిచ్ అంటే అర్ధం ఏమిటి అంటే గబుక్కున చెప్పడం కష్టమే. వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేలోగా ఎన్నికలు ముగిసినా ముగియవచ్చు. లోతుగా వెళ్తే ఒక విషయం గోచరిస్తుంది. బాగా డబ్బున్న వారు పేదలను బాధ్యత తీసుకుని వారికి చేయూతను ఇచ్చి ముందుకు నడిపించాలని.
అయితే ఇది అందమైన కలగా కనవచ్చు. ఆచరణ సాధ్యమేనా అన్నది చూస్తే జవాబు సులువే. కాదు అన్నదే దాని సమాధానం. ఈ రోజున సొంత కుటుంబాలలో ఎవరికి వారుగా మారి బాధ్యత తీసుకోవడం మరచిపోతున్నారు. అన్నదమ్ములలో ఒకరు ఆర్ధికంగా స్థితిమంతులు అయితే మరొకరిని ఆదరించిన సందర్భాలు నూటికో కోటికో కూడా కనిపించడంలేదు.
అలాంటిది సమాజంలో ఎవరో ఒకరి కోసం ధనవంతులు బాధ్యత తీసుకోవడం అయ్యే పనేనా. నిజంగా అది జరిగితే అద్భుతం అనే చెప్పాలి. దీన్ని చంద్రబాబు ఎన్నికల వేళ ముందుకు తెస్తున్నారు. గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారు ఇక్కడి కుటుంబాలను బాగు చేసే బాధ్యతను తీసుకోవాలని చంద్రబాబు అంటున్నారు.
అలాగే, ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలన్నారు. ఇలా చంద్రబాబు చాలా విషయాలు చెబుతున్నారు. దానితో పాటు సంపదను సృష్టించి దానిని పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు అని ఆయన అంటున్నారు.
ఏపీ వరకు చూస్తే ఉమ్మడి పదమూడు జిల్లాలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉంది. సంపద సృష్టించడం అంటే ఓవర్ నైట్ అయ్యే పని కానే కాదు. ప్రతీ అయిదేళ్లకు ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల లోగా సంపదను సృష్టించి పంపిణీ చేయడం కూడా కష్టసాధ్యమే.
పరిశ్రమలు ఏర్పాటు చేస్తే సంపద కొంత సృష్టి అవుతుంది అనుకున్నా అది కూడా విత్తనం నాటి మొక్క చెట్టు కావాలంటే రెండు దశాబ్దాల కాలం ఈజీగా అవుతుంది. అమరావతి రాజధాని అన్నది చూస్తే కనుక అది అర్ధ శతాబ్దం కల అని ఇప్పటికే చాలా మంది మేధావులు చెబుతున్న మాట.
ఏపీని ఎలా ఉద్ధరించాలి అన్నది కనుక చూస్తే వ్యవసాయాన్ని పెంచడం, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకుని రావడం అలాగే సముద్ర తీర ప్రాంతం అధికంగా ఉంది కాబట్టి ఆ దిశగా సాగర ఉత్పత్తులు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం చేయాలి. ఏది చేయాలన్నా కూడా ముందు పెట్టుబడులు కావాలి. ప్రభుత్వం తానుగా సిద్ధం కావాలి. దానికి నిధులు ఉండాలి.
ఇది కదా సమస్య. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లుగా ఈ పరిస్థితి ఉంటుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అయితే సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు అంటున్నారు. ఆయన 2014 నుంచి 2019 మధ్యలో ఎంత సంపద సృష్టించారు అన్న ప్రశ్న వైసీపీ నుంచి సూటిగా వస్తోంది. పూర్ టు రిచ్ ప్రాజెక్ట్ లోని డొల్లతనాన్ని కూడా వైసీపీ నేతలు ఎత్తిపొడుస్తున్నారు.
అలాగే చంద్రబాబు మరో మాట అంటున్నారు. ప్రతి కుటుంబం ఓ విజన్‌ను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందో ప్రణాళిక ఉండాలన్నారు. పూర్ టు రిచ్ విజయవంతమైందా లేదా తెలియాలంటే ఈ సంవత్సరం ఈ ఊరిలో తలసరి ఆదాయం ఎంత ఉంది వచ్చే ఏడాది ఎంత ఉంది అనేదానిని కొలమానంగా తీసుకోవాలని అంటున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలలో పూర్ టు రిచ్ అన్నది వినడానికి ఆకర్షణీయంగానే ఉంది. ఇది జనాలకు ఎంతవరకూ రీచ్ అవుతుందో చూడాలి.