టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీస్‌శాఖపై విసిరిన పంచ్ అదిరిపోయింది. రామచంద్ర యాదవ్ అనే పారిశ్రామికవేత్త, జనసేన మాజీ నాయకుడి ఇంటిపై పుంగనూరులో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలోని సదుంలో రైతు రణభేరీని రామచంద్ర యాదవ్ నిర్వహించతలపెట్టారు. అయితే పోలీసులు అనుమతించలేదు.
మంత్రి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా రామచంద్ర యాదవ్ మాట్లాడ్డంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం చెందారు. దీంతో ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటిని గత రాత్రి ధ్వంసం చేశారు. ఇది తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు…నేటి రోజుల్లో పుంగనూరు! డీజీపీ గారూ… నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు”. పోలీస్‌శాఖ అసమర్థతను రెండు వాక్యాల్లో చంద్రబాబు చక్కగా ఆవిష్కరించారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, వారికి ఖాకీ దుస్తులు పంపాలని చంద్రబాబు వ్యంగ్య ధోరణిలో చెప్పడం ఆకట్టుకుంటోంది.
అలాగే లోకేశ్ ట్వీట్ కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ జయహో బీసీ సభ నిర్వహణకు రెండు రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. లోకేశ్ వేర్వేరుగా చేసిన మూడు ట్వీట్లు జగన్ ప్రభుత్వ ఆగడాలను నిలదీస్తూ సాగాయి.
“సీఎం జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తుంటే, ఇటు పుంగనూరులో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2 స్థానంలో వున్న మంత్రి పెద్దిరెడ్డి గారు బీసీ నేతలని అంతమొందించే కుతంత్రాలు చేస్తున్నారు. బీసీ అయిన పుంగనూరు జనసేన నాయకుడు రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రామచంద్ర యాదవ్ బీసీ కావడమే నేరమా? రైతు సదస్సు నిర్వహించాలనుకోవడం ద్రోహమా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారూ ప్రశ్నించే వాళ్ల ప్రాణాలు తీయడమేనా మీకు తెలిసిన ప్రజాస్వామ్యం? ఒక బీసీ నేతని అంతమొందించే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి మనుషులే దాడికి దిగితే, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణం”. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ తమ ట్వీట్లకు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడికి సంబంధించిన వీడియోను జత చేయడం గమనార్హం.