సీమ గ‌ర్జ‌న‌… ప్చ్‌!

క‌ర్నూలులో నిర్వ‌హించిన సీమ గ‌ర్జ‌న స‌భపై వైసీపీ పెద‌వి విరుస్తోంది. సీమ గ‌ర్జ‌న స‌భ‌కు రాయ‌ల‌సీమ న‌లుమూల‌ల నుంచి జ‌నాన్ని త‌ర‌లించారు. అలాగే సీమ వ్యాప్తంగా వైసీపీ నేత‌లంతా హాజ‌ర‌య్యారు. కానీ సీమ గ‌ర్జ‌న…

క‌ర్నూలులో నిర్వ‌హించిన సీమ గ‌ర్జ‌న స‌భపై వైసీపీ పెద‌వి విరుస్తోంది. సీమ గ‌ర్జ‌న స‌భ‌కు రాయ‌ల‌సీమ న‌లుమూల‌ల నుంచి జ‌నాన్ని త‌ర‌లించారు. అలాగే సీమ వ్యాప్తంగా వైసీపీ నేత‌లంతా హాజ‌ర‌య్యారు. కానీ సీమ గ‌ర్జ‌న స‌భ నిర్వ‌హ‌ణ‌లో దారుణంగా వైఫ‌ల్యం చెందార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ స‌భ‌కు భారీ జ‌న స‌మీక‌ర‌ణ చేసిన‌ప్ప‌టికీ, అధికార పార్టీ తాను చెప్ప‌ద‌ల‌చుకున్న అంశాల్ని చెప్ప‌డంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

స‌భా వేదిక‌పై భారీ సంఖ్య‌లో అధికార పార్టీ నేత‌లు ఉండ‌డం, వాళ్లంద‌రికీ అవ‌కాశం ఇవ్వాల‌నే ఉద్దేశంతో ఎవ‌రినీ రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు మాట్లాడ‌నివ్వ‌లేదు. దీంతో వ‌క్త‌లు ఏ ఒక్క విష‌యాన్ని సూటిగా, స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అమ‌రావ‌తిలోనే హైకోర్టు వుంటుంద‌ని సుప్రీంకోర్టుకు ప్ర‌భుత్వం చెప్పిందంటూ సాగుతున్న దుష్ప్ర‌చారాన్ని కూడా ఈ స‌భా వేదిక‌పై నుంచి దీటుగా తిప్పికొట్ట‌లేక‌పోయారు. అంతా మొక్కుబ‌డి కార్య‌క్ర‌మంలా సాగిపోయింది. మూడు రాజ‌ధానుల బిల్లుల్ని వెన‌క్కి తీసుకోవ‌డం, అలాగే హైకోర్టు ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో… ఎప్ప‌ట్లాగే అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధాని అని సుప్రీంకోర్టులో చెప్ప‌డాన్ని కూడా స‌భ ద్వారా గ‌ట్టిగా జ‌నంలోకి తీసుకెళ్ల‌లేక‌పోయారు.

క‌ర్నూలులో హైకోర్టు ఏ విధంగా ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున్నారో, అలాగే సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌పై ప్ర‌భుత్వం వ‌ద్ద ఎలాంటి ప్ర‌ణాళిక వుందో అధికార పార్టీ నేత‌లు చెప్ప‌లేక‌పోయారంటున్నారు. తిరుప‌తిలో భారీ ర్యాలీ, బ‌హిరంగ స‌భ‌తో పోల్చుతూ క‌ర్నూలు సీమ గ‌ర్జ‌న‌పై అధికార పార్టీ నేత‌లు, సీమ ఉద్య‌మ‌కారులు పెద‌వి విరుస్తున్నారు. ఎంతో దూరం నుంచి జ‌నాన్ని త‌ర‌లించి కూడా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.