ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన పేరు లేదంటోంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఉందని సీబీఐ అంటోంది. ఇద్దరూ చెబుతున్న దాంట్లో ఏదో ఒకటే నిజం ఉంటుంది. మరి ఏది నిజం? ఒక పక్క తన పేరు లేదని చెబుతున్న కవిత సీబీఐ అధికారులు తనను విచారించడానికి ఎప్పుడు రావాలో కొన్ని డేట్స్ ఫిక్స్ చేసింది. అధికారులు తన ఇంటికి వస్తే తాను అవసరమైన వివరాలు చెబుతానని అంటోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐకి లెటర్ రాసింది కవిత. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదంటూ అనుమానం వ్యక్తం చేసింది. సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాననని అందులో ఉన్న నిందితుల జాబితాను కూడా చూశానని, దానిలో తన పేరు ఎక్కడా లేదని చెప్పింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేసింది. “సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను. అందులో ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.” అని చెప్పింది. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉన్నదని తెలిపారు. దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాసింది.
ఒక పక్క తన పేరు లేదని చెబుతున్న కవిత ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6న తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చింది. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో ఏదో ఒక రోజు సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేసింది. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరింది. ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేదని చెబుతున్నప్పుడు సీబీఐ అధికారులను కలుసుకోవడానికి వారికి డేట్లు ఎందుకు ఇచ్చిందో తెలియడంలేదు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత చెప్పింది. దర్యాప్తునకు సహకరించడానికి సీబీఐ అధికారులతో సమావేశం అవుతానని అంటోంది. డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో తెలిపింది. దిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ చెప్పింది. వెంటనే కవిత తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే అధికారులను కలుసుకోవడానికి అనుమతి ఇచ్చానని ప్రకటించింది.
అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏమిటంటే.. హైదరాబాద్‌లో సీబీఐ ఎంట్రీకి ఎప్పుడో రెడ్ సిగ్నల్ వేశారు. జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. మరి ఇప్పుడు సీబీఐ తెలంగాణలోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది? తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాల్సిన ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 30నే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ జీవో ప్రకారం ఇకపై రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విషయంలో రాష్ట్రంలో దర్యాప్తు జరపాలన్నా ముందుగా ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి తీసుకోవాలి.
ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుంటే మాత్రం.. ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు. అయితే కవితను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. మరి కవిత సీబీఐ అధికారులను తన ఇంటికే రావాలని కోరిందంటే ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చిందనే అనుకోవాలా?