అబ్బే…సిగ్గ‌నిపించదు!

ఒకే కుటుంబం. వేర్వేరు పార్టీలు. త‌మ వ్యాపార‌, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు దిగ్విజ‌యంగా సాగాలంటే ఆ రెండు పార్టీలే స‌రైన‌వ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నాయి కొన్ని రాజ‌కీయ కుటుంబాలు. అన్న ఒక పార్టీ, త‌మ్ముడు మ‌రో పార్టీ.…

ఒకే కుటుంబం. వేర్వేరు పార్టీలు. త‌మ వ్యాపార‌, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు దిగ్విజ‌యంగా సాగాలంటే ఆ రెండు పార్టీలే స‌రైన‌వ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నాయి కొన్ని రాజ‌కీయ కుటుంబాలు. అన్న ఒక పార్టీ, త‌మ్ముడు మ‌రో పార్టీ. తండ్రి ఒక పార్టీ, త‌న‌యుడు మ‌రో పార్టీ. పొలిటిక‌ల్ డ్రామాలు చూస్తూ… జ‌నం న‌వ్వుకుంటార‌నే బెరుకు లేదు. అస‌లు సిగ్గుప‌డాల్సిన విష‌య‌మే కాద‌ని రాజ‌కీయాలు చేయ‌డం వారికే చెల్లుతోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే… చిత్ర‌విచిత్రాలు క‌నిపిస్తాయి. మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ, ఆయ‌న త‌మ్ముడు కిశోర్‌రెడ్డి టీడీపీ, అలాగే మాజీ ఎంపీ టీజీ వెంక‌టేశ్ బీజేపీ, ఆయ‌న త‌న‌యుడు భర‌త్ టీడీపీ, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ, ఆయ‌న అన్న కుమారుడు భూపేష్ టీడీపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ బీజేపీ, ఆయ‌న అన్న సురేష్‌నాయుడు టీడీపీలో ఉంటున్నారు.  

టీజీ భ‌ర‌త్ క‌ర్నూలు అసెంబ్లీ స్థానం, అలాగే ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్న కుమారుడు భూపేష్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు, మాజీ సీఎం కిర‌ణ్ సోద‌రుడు కిశోర్ పీలేరు  నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి స‌మాయ‌త్తం అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో న‌ల్లారి కిశోర్‌, టీజీ భ‌ర‌త్ టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. వీళ్లంతా రాజ‌కీయ‌, వ్యాపార‌, వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీని ఆశ్ర‌యించార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాను సీఎం ర‌మేశ్ క‌లిసి ఏపీలో పొత్తుల్ని నిర్ణ‌యించేది జాతీయ నాయ‌క‌త్వ‌మే అని, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో గ‌ద్దె దించుతామ‌ని చెప్ప‌డం వెనుక టీడీపీ ప్ర‌యోజ‌నాలు లేవ‌ని ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా? ఒక‌వైపు టీడీపీతో పొత్తు లేద‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప‌దేప‌దే చెబుతున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం జ‌న‌సేన‌తోనే పొత్తు వుంటుంద‌ని ఆయ‌న అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏపీ బీజేపీ నేత‌ల మాట‌ల్ని ప‌ట్టించుకోకుండా, ఢిల్లీలో కూచుని టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం లాబీయింగ్ చేయ‌డాన్ని ఎలా చూడాలి?

టీజీ భ‌ర‌త్ ఇంట్లో కూచొని ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి శ‌నివారం మీడియా స‌మావేశం పెట్టారు. అలాగే చంద్ర‌బాబునాయుడిని సీఎం ర‌మేశ్ అన్న సురేష్ శ‌నివారం క‌లిశారు. ఇక ఆదినారాయ‌ణ‌రెడ్డి గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. పేరుకే ఆయ‌న బీజేపీ. ఆదినారాయ‌ణ‌రెడ్డి సంబంధాల‌న్నీ టీడీపీ నేత‌ల‌తోనే. తెల్లారి నిద్ర‌లేచిన‌ప్ప‌టి నుంచి హైద‌రాబాద్‌లో టీడీపీ నేత‌ల‌తోనే గ‌డుపుతుంటారు. చంద్ర‌బాబు త‌న మ‌నుషుల్ని ఇత‌ర పార్టీల్లో పెట్టి, ఎలా రాజ‌కీయాలు చేస్తారో ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి? ఇదే వైఎస్ జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే… ద‌గ్గుబాటి కుటుంబంలో పురందేశ్వ‌రి బీజేపీలో, ఆమె భ‌ర్త వెంక‌టేశ్వ‌ర‌రావు, కుమారుడు త‌మ పార్టీలో ఉండ‌డాన్ని ఆయ‌న అంగీక‌రించ‌లేదు.

పురందేశ్వ‌రిని కూడా త‌మ పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించారు. లేదంటే అటొక‌రు, ఇటొక‌రు ఉండ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. చివ‌రికి ద‌గ్గుబాటి ఫ్యామిలీ వైసీపీని వీడాల్సి వ‌చ్చింది. బాబు మార్క్ రాజ‌కీయాలు ఏపీలో విజ‌య‌వంతంగా సాగుతున్నాయి. ఎవ‌రేమ‌నుకున్నా చంద్ర‌బాబు మాత్రం త‌న వాళ్ల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీలోకి పంపి, టీడీపీ కోసం ప‌ని చేయించుకోవ‌డాన్ని అభినందించాల్సిందే. రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, మ‌రే విలువ‌ల్ని ప‌ట్టించుకోని కాలంలో… రానున్న రోజుల్లో ఇలాంటివి మ‌రిన్ని పెర‌గొచ్చు.