ఎవ్వరెంత గేలిచేసినా.. బాబుగారు మారరు!

చంద్రబాబునాయుడుకు కష్టపడి పనిచేసే నాయకుడు అని కొంత గుర్తింపు ఉంది. అయితే ఆవగింజంత పనిచేస్తే, తాటికాయంత ప్రచారాన్ని కోరుకునే నాయకుడిగా మరింత స్ట్రాంగు గుర్తింపు కూడా ఉంది. ఆయన ప్రచారకాంక్ష గురించి అనేక  రకాల…

చంద్రబాబునాయుడుకు కష్టపడి పనిచేసే నాయకుడు అని కొంత గుర్తింపు ఉంది. అయితే ఆవగింజంత పనిచేస్తే, తాటికాయంత ప్రచారాన్ని కోరుకునే నాయకుడిగా మరింత స్ట్రాంగు గుర్తింపు కూడా ఉంది. ఆయన ప్రచారకాంక్ష గురించి అనేక  రకాల జోకులు ప్రచారంలో ఉంటాయి కూడా. 

సాధారణంగా రాజకీయ నాయకులు తమ మీద విమర్శలు వస్తే పట్టించుకోకపోవచ్చు గానీ, జోకులు వస్తే పట్టించుకుంటారు. తమను ఎద్దేవా చేస్తూ ఉంటే బాధపడతారు, తమ తీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ చంద్రబాబునాయుడులో అలాంటి లక్షణాలేమీ ఉన్నట్టు లేదు! అందుకే ఆయన తన అతిశయాలు, డప్పుకొట్టుకునే డైలాగుల గురించి ఎవరెన్ని జోకులు వేస్తున్నా సరే.. మళ్లీ అలాంటి సొంత డబ్బా మాటలే చెబుతున్నారు. 

మామూలుగా ప్రచారంలో ఉండే జోకులు ఇవీ! చంద్రబాబునాయుడు బిల్ గేట్స్ కు కంప్యూటరు వాడడం ఎలాగో తానే నేర్పించానని చెబుతారని, తానంటూ లేకపోతే అబ్దుల్ కలాం అసలు రాష్ట్రపతి అయ్యే అవకాశం లేనే లేదు అంటారని, ఇంకా వినేవాళ్లుంటే.. స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిందిగా మహాత్మా గాంధీకి తానే స్ఫూర్తి ఇచ్చానని, రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ కు తానే డిక్టేషన్ చెప్పానని అనగలరని ఆయన మీద జోకులుంటాయి. తాను లేకపోతే హైదరాబాదు నగరమే లేదని అనే స్థాయిలో అతిశయమైన డప్పుకొట్టుకునే చంద్రబాబు వైఖరిని మనం చాలా సందర్భాల్లో గమనిస్తూనే ఉంటాం. 

తాజాగా చంద్రబాబు అలాంటి పనే మరొకటి చేశారు. హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లింలకు రంజాన్ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటివన్నీ తన హయాంలోనే జరిగాయని, అందువల్లనే పాతబస్తీ అభివృద్ధి చెందిందని.. ఇంకా అలాంటి మాటలు చాలా చెప్పారు. పనిలో పనిగా ‘నేడు ప్రపంచానికి కరోనా టీకా అందించిన నగరంగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం వెనుక తెలుగుదేశం హయాంలో చేసిన కృషి మాత్రమే కారణం’ అని కూడా చంద్రబాబునాయుడు అన్నారు.

ముస్లిములతో సమావేశం గనుక.. హజ్ హౌస్, పాతబస్తీ అభివృద్ధి లాంటి కతలు చెబితే బాగానే ఉంటుంది. మధ్యలో కరోనా టీకా గొడవ ఎందుకు లాక్కొచ్చారో అర్థం కాదు. కరోనా టీకా కనుక్కోవడానికి తానే ప్రధాన కారణం అని, తాను చేయకపోతే.. ఇవాళ టీకా అనేది ఉండేది కాదని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు డప్పుకొట్టుకోవడం కామెడీగా ఉంది. 

చంద్రబాబు సొంత డప్పు కితకితలు తెలిసిన వారు మాత్రం.. ‘ఇంకా నయ్యం.. కరోనా టీకా కనుక్కొన్నది నేనే. నా డైరక్షన్ లోనే వాళ్లు ప్రయోగాలు చేశారు’ అని చెప్పలేదు.. అందుకు సంతోషించాలి.. అని గేలిచేస్తున్నారు. చంద్రబాబునాయుడు తీరు అంతే.. ఎవ్వరెంత గేలిచేసినా ఆయన తీరు మారదు అని జనం అనుకుంటున్నారు.